అదిరిపోయే టైటిల్ తో బాలయ్య- బోయపాటి క్రేజీ ప్రాజెక్ట్ BB3 శివరాత్రికి ప్రకటన?
నట సింహ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న క్రేజీ మూవీ టైటిల్ ఫిక్స్ చేశారనేది లేటెస్ట్ టాక్. ఈ టైటిల్ ప్రకటిస్తూ త్వరలోనే ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయనుందట చిత్రయూనిట్.సింహ, లెజెండ్ సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి హాట్రిక్ హిట్ ప్లాన్ చేసింది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఈ మేరకు మరో మాస్ ఓరియెంటెడ్ కథతో సెట్స్ మీదకొచ్చారు. BB3 అని వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే లాక్ చేసింది చిత్రయూనిట్. మహా నటుడు నటరత్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలపడంతో అందరి కళ్లు సినిమా టైటిల్‌పై పడ్డాయి. ఇంతకీ ఈ మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనే చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ క్రేజీ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌నే ఫైనల్ చేశారని, ఈ టైటిల్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ టాక్ బయటకొచ్చిన క్షణం నుంచి అందరి చూపు ఆ డేట్‌పై పడింది. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సిఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం షూటింగ్ వేగం పెంచేసిన బోయపాటి అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది.













