ఆర్ఆర్ఆర్’ సినిమా ముందుగా కొమురం భీమ్, అల్లూరి సీతా రామరాజు కుటుంబ సభ్యులకు చూపించాలి! : ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
ఆర్ఆర్ఆర్ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో గాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనుకున్న తేదికి విడుదలకు నోచుకోలేదు. తీరా ఏదైనా డేట్ ప్రకటిస్తే ఏదో ఒక అవాంతరాలు. ప్రస్తుతం ఈ సినిమా పై సరికొత్త సమస్య వచ్చింది అదేటంటే? ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారని, నిస్వార్ధంగా ప్రాణ త్యాగం చేసిన వీరుల పేర్లను వ్యాపారం కోసం వాడుకుంటున్నారని, కాబట్టి సినిమాను ముందుకు చరిత్రకారులకు, ఆయా కుటుంబ సభ్యులకు చూపించి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమైనా ఉంటే తీసేయాలని, లేని యెడల సెంట్రల్ సెన్సార్ బోర్డు ముందు దీక్ష చేపడతామని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం ఎంటైర్ ఇండియా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మార్చి 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రారంభం నుండి పినిమాపై భారీ అంచనాలున్నాయి. చరిత్రలో ఇద్దరు కలుసుకోని యోధులు కొమురం భీమ్, అల్లూరి సీతా రామరాజు వారిద్దరూ కలుసుకుని బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇదొక ఫిక్షనల్ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఎప్పుడో చెప్పేశారు కూడా. అయితే ఇదే పాయింట్ ఇప్పుడు వివాదాలకు కారణమవుతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంతో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది.
అయితే ఈసారి పొలిటికల్ పార్టీ రూపంలో ఆర్ఆర్ఆర్ కు సమస్య ఎదురైంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పోరాట వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన చరిత్రలను వక్రీకరిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ‘‘నిస్వార్దంగా పోరాడిన వీరులను రాజమౌళి డబ్బుల కోసం వాడుకుంటున్నారు. డబ్బుల కోసం వారిని కించ పరిచేలా ఆర్ఆర్ఆర్ సినిమా ఉంటుందని, అల్లూరి సీతా రామరాజు బ్రిటీష్ వారి దగ్గర పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసినట్లు, అమ్మాయితో డాన్స్ చేసినట్లు చూపిస్తున్నారు. చరిత్రకారులకు, భీమ్, అల్లూరి కుటుంబ సభ్యులకు ముందుగా సినిమాను చూపించి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలి. రాజమౌళి గొప్ప దర్శకుడు ఆయన మగధీర, బాహుబలి వంటి సినిమాలను మేం తప్పు పట్టడం లేదు.
సినిమాను సినిమాగానే చూడాలన్నప్పుడు మరి ప్రాణాలు అర్పించిన వీరుల పేర్లు ఎందుకు వాడుకోవడం. ఈ సినిమా ద్వారా యువతను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తాం. హైదరాబాద్, ఢిల్లీలోని సెంట్రల్ సెన్సార్ బోర్డు దగ్గర దీక్షలు చేపడతాం’’అంటున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇరవై రోజు మాత్రమే వుంది. ఇన్నాళ్లు సీపీఐ సభ్యులు ఏం చేస్తున్నారో రిలీజ్ దెగ్గరకు వచ్చినప్పుడు గుర్తొచ్చిందనుకుంటా! రాజమౌళి అండ్ టీమ్ ఏమని సమాధానం చెబుతారో మరి.













