Court Movie: సున్నితమైన టాపిక్ తో ‘కోర్ట్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
నటినటులు : ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి,
శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషిక, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్, ఆర్ట్: విట్టల్ కోసనం
స్క్రీన్ ప్లే,: రామ్ జగదీష్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: S. వెంకటరత్నం (వెంకట్)
సహ నిర్మాత: దీప్తి గంటా, సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, కథ, దర్శకత్వం : రామ్ జగదీష్
విడుదల తేది 14.03.2025
నిడివి : 2 ఘంటల 30 నిముషాలు
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న రేపు థియేటర్లలో విడుదల కానుంది. సినిమా రిలీజ్ వరకు ఎంతగా ప్రమోట్ చేసుకున్నా, ఎంత వుదరగోట్టినా, ఆ రిలీజ్ కానియ్ చూద్దాం! అనుకుంటాడు ఈ నాటి ప్రేక్షకుడు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయి జనాల్లోకి వెళ్తే సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఒక్క ఆటతో రిజల్ట్ వచ్చేస్తుంది. చిన్న కాస్టింగ్ తో నిర్మించన సినిమా రిలీజ్‌కు రెండ్రోజులు ముందుగానే మీడియాకు ప్రదర్శించడం అంటే మాములు విషయం కాదు ఇది చిత్రం పై వున్నా నమ్మకం తో ఈ సాహసం చేసారు ‘కోర్ట్’ టీం. విషయనికోస్తే… నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఏంటి? అసలు ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంది? రామ్ జగదీష్ ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకున్నాడు ? అన్నది రివ్యూ లో చూద్దాం.
కథ :
ఈ సినిమా కథంతా 2013 లో సాగుతుంది. వైజాగ్ లో మంగపతి (శివాజీ) కి మంచి రాజకీయ పలుకుబడి వుంటుంది. తన మమయ్య (శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్‌లు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. సొంతంగా డబ్బులతో ఫైనాన్స్‌లో ఓ బైక్ కూడా తీసుకుంటాడు. అలాంటి చందు లైఫ్‌లోకి జాబిల్లి (శ్రీదేవీ) వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ సంగతి కోపిష్టి అయిన జాబిలి మామ మంగపతి కి తెలుస్తుంది. అసలు ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా బట్టలు వేసుకున్నా సహించలేని మంగపతికి ఈ ప్రేమ కథ గురించి తెలుస్తుంది. దీంతో తన పలుకుబడి ఉపయోగించి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. ఈ పనిలో తన లాయర్ దామోదర్ (హర్ష వర్దన్) మంగపతికి తోడుంటాడు. మరి చందుని బయటకు తీసుకు వచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) ఏం చేస్తాడు? అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకుల్ని ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందుని ఎలా బయటకు తీసుకు వస్తాడు? ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నం (రోహిణి) పాత్ర ఏంటి? అన్నది థియేటర్ లో చూడాల్సిందే!
నటీనటుల హవభావాలు :
కోర్ట్ సినిమాలో చాల ఏళ్ళ తరువాత నటిస్తున్నశివాజీ నటన చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మంగపతి పాత్రలో శివాజీ జీవించేశాడు అని చెప్పొచ్చు. మంగపతి పాత్రకే ఎక్కువగా విజిల్స్ పడతాయి. ఇక ఆ తరువాత ప్రియదర్శి తన సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. హర్ష వర్దన్, సాయి కుమార్ సీనియర్ లాయర్లుగా అద్భుతంగా నటించారు. పోక్సో చట్టంలో ఇరుక్కున్న కుర్రాడిగా చందు పాత్రలో రోషన్ బాగా నటించాడు మంచి భవిష్యత్ వుంది. కుర్రాడి తల్లిగా ప్రభావతి, అమ్మాయి తల్లిగా రోహిణి పాత్రలు బాగుంటాయి. వారి నటన సైతం ఆకట్టుకుంటుంది. జాబిల్లి కారెక్టర్‌లో శ్రీదేవీ చక్కగా సెట్ అయింది. ఇంటర్ పిల్లలు ఎలా ఉంటారో.. ఎలా ప్రవర్తిస్తారో..రోషన్, శ్రీదేవీ ఇద్దరూ అలానే కనిపించారు.. నటించారు. హీరో ఫ్రెండ్ పాత్రలు, మిగిలిన కారెక్టర్స్ అన్నీ ఈ చిత్రానికి బాగా సెట్ అయ్యాయి.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాల సున్నితమైనది. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా నీట్ గా డీల్ చేసాడు. ఈ విషయం లో దర్శకుడిని అభినందించాల్సిందే! కోర్ట్ కథ ప్రస్తుతం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. పోక్సో చట్టం మీద అవగాహన లేక, చేసేది చట్టరిత్యా నేరం అన్నది తెలీక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని, ఇలా చేస్తే తప్పు.. అది చేస్తే నేరం అని విడమరిచి చెప్పి, చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చదువు అందరికీ చెప్పినా చెప్పకపోయినా.. చట్టం గురించి అందరికీ తెలియచేయాలనే పవర్ ఫుల్ పాయింట్‌ను ఆడియెన్స్ మైండ్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంత మందికి తెలుసు? అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు.
ఈ కోర్ట్ సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే. మిగతాది అంతా సినిమా టిక్ గానే వుంటుంది. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కు పెట్టిన విమర్శలు, చట్టంలో వున్నా అవక తవకలను ప్రశ్నించిన తీరు బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. పన్నెండేళ్ళ క్రితం జరిగే ఈ కథకు కెమెరామెన్ మంచి విజువల్స్ అందించారు. కోర్ట్ సెట్ కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. మరి ఇది కమర్షియల్‌గా ఏ రేంజ్‌కు వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం. నిర్మాతగా నాని టేస్ట్ ఏంటో మరోసారి అందరికీ అర్థం అవుతుంది. నిర్మాతగా నాని ఓ మంచి సబ్జెక్ట్, పాయింట్‌ను ప్రజల ముందుకు తీసుకు వచ్చాడు. కానీ నిర్మాతగా నాని మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథ మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు. అయితే ఈ ప్రేమ కథే సినిమాకు కాస్త మైనస్ అయ్యింది. ఆ ట్రాక్‌ను అంత సేపు చూపించకుండా ఉండే సినిమా ఇంకాస్త బెటర్‌గా అనిపించేదేమో. ఫస్ట్ హాఫ్‌లో అందరూ మంగపతి కారెక్టర్‌కు కనెక్ట్ అవుతారు. మంగపతి కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి మంగపతి దుర్మార్గుడిలా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగపతి కారెక్టర్ హైలెట్ అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్‌తో కథ కాస్త గాడిన పడుతుంది. కోర్ట్ డ్రామా ఎలా ఉంటుంది? ఎంత ఆసక్తికరంగా చూపిస్తారో? అన్న ఉత్కంఠతో సెకండాఫ్‌కు రెడీ అవుతాడు ప్రేక్షకుడు. అయితే కోర్ట్ డ్రామా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. అసలు ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని కూడా అనిపిస్తుంది. ఎమోషనల్‌గానూ చాలా కనెక్ట్ చేసే కంటెంట్ ఉందనిపిస్తుంది.
కథ లో ‘జై భీమ్’ రేంజ్‌లో ఎమోషన్స్‌ను కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా ఆ స్థాయిని రీచ్ కాలేకపోయింది. ప్రేక్షకుడు ఎమోషన్స్ గాని గురిచేస్తే ఈ సినిమా టాక్ ఇంకా అధ్బుతంగా వుంటుంది. సినిమాలో మెయిన్ థీమ్, అలాగే టీనేజ్ లో పుట్టే తొలిప్రేమ తాలూకు కష్టనష్టాలు, ఇక పేదవాళ్ళకి ఈరోజుల్లో న్యాయం జరగడం లేదు’ అనే కోణం.. వీటి మధ్య మంగపతి లాంటి బలమైన పాత్రలు.. వాటి సంఘర్షణలు.. మొత్తంగా ఈ కోర్ట్ సినిమా ఆకట్టుకుంది. ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాలో.. మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఫోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే, కొన్ని బలమైన కోర్ట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రతి ఒక్కరి హార్ట్ ని టచ్ చేస్తుంది.