అయోమయంలో టాప్ డైరెక్టర్స్
కరోనా ప్రభావం ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో షూటింగులకు అనుమతి ఇప్పట్లో వచ్చేలా లేదు.ఇలాంటి పరిస్థితుల్లో సగం సినిమా పూర్తయిన సినిమాల పరిస్థితి ఏమిటో అర్థం కాక దర్శక నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ మరో 30 శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సినిమాకు ఎంతో కీలకమైన ఆఖరి షెడ్యూల్ ఇది. దాన్ని పూణెలో తియ్యడానికి ప్లాన్ చేశారు. కానీ, ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ కారణంగా అక్కడ షూటింగ్ చేసే అవకాశాలు లేవు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలోనే సెట్స్ వేసి సినిమాని పూర్తి చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫైటర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ముంబయ్‌లోని ధారావిలో ఓ షెడ్యూల్ చెయ్యాలి. కానీ, అక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో పూరి కూడా రాజమౌళిలాగే హైదరాబాద్‌లోనే సెట్స్ వేసి సినిమాని కంప్లీట్ చెయ్యాలని భావిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగినట్టయితే 2021 జనవరికి సినిమాని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు షూటింగ్ పార్ట్ కూడా పూర్తి కాలేదు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సరేసరి. కాబట్టి ఇప్పుడు షూటింగ్ స్టేజ్‌లో ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పైగా షూటింగ్‌లకు ఎప్పటి నుంచి అనుమతి ఇస్తారనే విషయంలో క్లారిటీ లేదు. మరి ఈ కష్టాల నుంచి సినీపరిశ్రమ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.













