టాలీవుడ్ కరోనా స్పెషల్ ఆఫర్ : నటి నటులు సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లో 20 శాతం కోత
సినిమా థియేటర్లు తెరుచుకునే ముందు యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికంలో 20శాతం కోత విధించింది. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవడం, థియేటర్ల మూతపడటం వల్ల సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ పేరుతో ఒక్కొక్కటిగా అనుమతులు ఇస్తోంది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లను కూడా 50 శాతం సీటింగ్‌తో తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి ముందు టాలీవుడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం విషయంలో యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో నటీనటులతో పాటు టెక్నీషియన్ల పారితోషికాన్ని 20 శాతం తగ్గించాలన్న తీర్మానం చేసింది. రోజుకు రూ.20 వేలకు పైగా పారితోషికం తీసుకునే నటీనటులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఒక సినిమాకు ఐదు లక్షల రూపాయలకు పైగా పారితోషికం తీసుకునే వారికి కూడా 20 శాతం కోత తప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా), ఏటీఎఫ్ పీజీ మధ్య అంగీకారం కుదిరింది. ఈ నిర్ణయానికి నటులు, సాంకేతిక నిపుణులు సహకరించాలని తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ కోరింది. తెలుగు సినీ పరిశ్రమకు త్వరలోనే మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.













