డైరెక్టర్ పూరీకి కరోనా ఎఫెక్ట్…
ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టు ఆవురావురుమంటూ ఎట్టకేలకు విజయాన్ని ఆరగించిన దర్శకుడు పూరీ జగన్నాధ్.. ఆ విజయం ఇచ్చిన స్పూర్తితో అందుకోవాలనుకున్న మరో విజయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన పూరీ ఆ తర్వాత క్రేజీ యూత్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడట. తెరపై బాక్సింగ్ని పండించడం కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
జాతీయస్థాయిలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా కోసం పూరీ జగన్నాథ్ కొన్ని నెలల క్రితమే ముంబైకే షిఫ్ట్ అయిపోయాడు. అక్కడే దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిందంటున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూ ఉండటంతో పూరీ యూనిట్ హైదరాబాద్కి తిరిగొచ్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫైటర్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందని సమాచారం.అయితే హైదరాబాద్ లోనూ కేసుల సంఖ్య ఎక్కువే ఉండటంతో మరికొన్ని నెలలు ఆగడమే మేలని నిర్ణయించుకున్నారని, కనీసం సెప్టెంబరు వరకు షూటింగ్ మొదలుపెట్టే ఆలోచన అయితే లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.













