RGV: హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు ఆర్జీవీ, స్వప్నపై ఫిర్యాదు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma), సీనియర్ యాంకర్ స్వప్న(Swapna)పై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు నమోదైంది. మనోభావాలను దెబ్బ తీసినందుకు ఆర్జీవీ, స్వప్నపై ఫిర్యాదు దాఖలైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రెసిడెంట్, హైకోర్టు లాయర్ మేడా శ్రీనివాస్(MEDA Srinivas), రామ్ గోపాల్ వర్మ, యాంకర్ స్వప్నపై రాజమండ్రిలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
ద్వేషపూరిత ప్రసంగాలు చేసి హిందూ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వాటిని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయిన ఫేస్బుక్, యూట్యూబ్ లో పోస్ట్ చేశారని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి లిఖితపూర్వక ఫిర్యాదుతో పాటూ డాక్యుమెంటరీ ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించారు.
ఆర్జీవీ, స్వప్న చేసిన కామెంట్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ కామెంట్స్ జాతీయ సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నాయని మేడా శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. హిందూ దేవుళ్ల గురించి ఆర్జీవీ(RGV) అగౌరవంగా మాట్లాడారని, రామాయణం, మహాభారతాలను ఆయన అపహాస్యం చేశారని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.













