మ్యూజిక్ డైరక్టర్ల మధ్య పెరుగుతున్న పోటీ
టాలీవుడ్ లో మొదటి నుంచి మ్యూజిక్ డైరక్టర్ల కొరత ఉంటూనే ఉంది. ఒకప్పుడు ఇళయరాజా, చక్రవర్తి చేతుల మీదుగా ఎక్కువ సినిమాలు నడిస్తే, ఆ తర్వాత కోటి, రాజ్ తమ హవా చూపించారు. ఆ తర్వాత చాలా కాలంగా దేవీ శ్రీ ప్రసాద్ తన హుషారును చూపిస్తూ.. రాక్ స్టార్ గా ఎదిగాడు. తన ట్యూన్ల కోసం, మ్యాజిక్ కోసం పెద్ద పెద్ద బ్యానర్లు సైతం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన ట్యూన్స్ తో ఆడియన్స్ ను దేవీ శ్రీ మెస్మరైజ్ చేస్తున్న టైమ్ లో సరిగ్గా థమన్ ఎంట్రీ అయ్యాడు.
దేవీ షెడ్యూల్ బిజీగా ఉండటంతో థమన్ వైపు కొన్ని ఛాన్సులు వెళ్లాయి. అసలు థమన్ కెరీర్ ను స్టార్ట్ చేసినప్పుడు ఈ రేంజ్ కు వెళ్తాడని ఎవరూ అనుకోలేదు. కెరీర్ ప్రారంభం నుంచే కొత్తదనాన్ని చూపిస్తూ.. స్పీడ్ పెంచిన థమన్ మ్యూజిక్ కి యూత్ ఫిదా అవడం మొదలైంది. స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే రేంజ్ కు థమన్ వెళ్లాడు. ఈ ఇద్దరి ధాటికి ఒక అడుగు వెనక్కి తగ్గినట్లుగా కనిపించిన మణిశర్మ సైతం ఇప్పుడు తిరిగి తన సత్తా చాటడం మొదలెట్టాడు. వీరు కాకుండా ఒక మాదిరి బడ్జెట్ సినిమాలైతే అనూప్, మిక్కీ జె. మేయర్ చేస్తూ వస్తున్నారు.
ఈ మధ్య టాలీవుడ్ లో మ్యూజిక్ డైరక్టర్స్ మధ్య బలమైన పోటీ ఏర్పడిందన్న విషయం అర్థమైంది. పెద్ద బ్యానర్లలోని సినిమాలకు దేవీ శ్రీ, థమన్, మణిశర్మ లు ఛాన్స్ లు కొట్టేస్తుంటే.. చిన్న సినిమాలతో చాలా మంది మ్యూజిక్ డైరక్టర్లు బిజీ అవుతున్నారు. వీళ్లలో కొంతమంది కొత్తవాళ్లయితే, మరికొందరు ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్న వాళ్లు. ఈ లిస్ట్ లో రథన్, కాల భైరవ, జేక్స్ బిజోయ్, అచ్చు, రోషన్ సాలూరు, శ్రీ చరణ్ పాకాల, సాయి కార్తిక్, సురేష్ బొబ్బిలి, అరుణ్ పేర్లు కనిపిస్తున్నాయి. వీరు కాకుండా పాన్ ఇండియా సినిమాలకైతే కీరవాణి, అమిత్ త్రివేది, జస్టిన్ ప్రభాకరన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ లో మ్యూజిక్ డైరక్టర్ల మధ్య పోటీ బాగా పెరిగిందనే విషయం క్లియర్ అయింది.













