అక్టోబర్ 15 నుంచి థియేటర్లు.. ప్రేక్షకులు ఎటువైపు? థియేటర్లా? ఓటీటీలా?
ప్రపంచ సినీ చరిత్రలో ఎప్పుడూ ఎదురుకాని సమస్య ఇప్పుడు వివిధ దేశాల్లోని చిత్ర పరిశ్రమల్ని అతలాకుతలం చేస్తోంది. కొన్ని వేల సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. హాలీవుడ్ తర్వాత భారత దేశంలోనే సినిమా నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ థియేటర్లు కూడా ఎక్కువే. మాధ్యమాలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులు మాత్రం థియేటర్లోనే సినిమా చూసేందుకు ఇష్టపడతారు. లాక్డౌన్ పుణ్యమాని గత ఆరు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఇప్పుడు థియేటర్ యాజమాన్యాలు తమ తమ థియేటర్లను జనం కోసం ముస్తాబు చేసే పనిలో పడ్డాయి. నిర్మాతలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ థియేటర్లు లేకపోవడం వల్ల జనం ఓటీటీ మీదే ఆధార పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ద్వారా జనం ముందుకు తీసుకెళ్ళారు. నిజానికి ఓటీటీ ద్వారా విడుదలైన ఏ సినిమా ఇప్పటివరకు హిట్ టాక్ తెచ్చుకోలేదు. అందుకు కారణం ఏమిటి అనే విషయాన్ని అందరూ పరిశీలిస్తున్నారు.
సినిమా పుట్టినప్పటి నుంచి జనం థియేటర్లకే అలవాటు పడ్డారు. థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూస్తేనే సినిమా చూసినట్టు. థియేటర్లు మూత పడడం వల్ల… తప్పక ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లో చూసినా, టీవీలో చూసినా ఒకటే. కొన్ని సినిమాలు మాత్రం తప్పనిసరిగా థియేటర్లో చూస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. అది సినిమాటోగ్రఫీ కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఏదైనా పెద్ద స్రీన్మీద ఎంజాయ్ చేసినంతగా చిన్న స్రీన్ మీద ఎంజాయ్ చెయ్యలేరు. కొంతమందికి సినిమా థియేటర్స్‌ని తలపించే పెద్ద టీవీలు, హోమ్ థియేటర్స్ వుండొచ్చు. అందరికీ ఆ సౌకర్యం ఉండదు కదా. కాబట్టి థియేటర్స్‌లో సినిమా చూడడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఇటీవల విడుదలైన నిశ్శబ్దం వంటి సినిమా థియేటర్లోనే చూడాలి. అప్పడే ఆ సినిమాలోని క్వాలిటీ తెలుస్తుంది. అందుకే ఆ దర్శకనిర్మాతలు మొదటి నుంచీ తమ సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తామని పట్టుపట్టారు. ఆరు నెలలు వృధాగా గడిచిపోవడంతో ఓటీటీ వైపు మొగ్గు చూపారు.
కరోనా భయం వల్ల థియేటర్లకు జనం వచ్చేది అనుమానమే అని ఒక వర్గం భావిస్తోంది. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ముఖ్యం కావడం, వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఒకేచోట చేరడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జనం థియేటర్లకు రారు. మరో వర్గం అభిప్రాయం ఏమిటంటే.. ఇప్పటివరకు టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి సాధనాల్లో సినిమాలు చూసి విసుగొచ్చిన ప్రేక్షకులు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత తప్పకుండా వస్తారు అని. ఏ హీరో సినిమా, డైరెక్టర్ ఎవరు, ఎలాంటి సినిమా అనే ఆరా కొంతమందికి అస్సలు ఉండదు. ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. దాన్ని చూసెయ్యాలి అనుకుంటారు. అలాంటి వారు తప్పకుండా థియేటర్స్‌కే వస్తారు. ఇలా భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అక్టోబర్ 15న థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ అవుతున్నాయి. మరో పది రోజులు ఆగితే సినిమా థియేటర్లు హిట్టా? ఓటీటీలు హిట్టా? అనేది తేలిపోతుంది.













