హీరోలూ.. పెద్ద మనసుతో ఆలోచించండి
హీరోలూ.. పెద్ద మనసుతో ఆలోచించండి కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల అన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతోంది. సినిమానే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కోట్లు కుమ్మరించి నిర్మించిన సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఇక చిన్న సినిమా నిర్మాత పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలీదు, షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. అంతా అనుకూలించి థియేటర్స్ ఓపెన్ చేసినా ఇంతకుముందు లాగా జనం థియేటర్స్‌కి వస్తారన్న నమ్మకం అస్సలు లేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటంటే డిసెంబర్ వరకు సినిమా థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదని, ఈ మేరకు థియేటర్ల యాజమానులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే… ఆ నిర్మాతకు ఎంత లాభం వస్తుందనేది పక్కన పెడితే ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్‌కి మాత్రం మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అదే అదనుగా తమ రెమ్యురేషన్స్ను అమాంతం పెంచేస్తారు. తర్వాత వారితో సినిమా చేసే నిర్మాతపై ఆ భారం పడుతుంది. ప్రస్తుతం స్టార్ హీరో నుంచి ఓ రేంజ్ హీరో వరకు వారు చేస్తున్న సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించిన నిర్మాతకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో హీరోలు పెద్ద మనసుతో ఆలోచించాలని, అలాగే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్స్ కూడా నిర్మాతను ఈ కష్టాల్లోంచి గట్టెక్కించేందుకు చొరవ చూపాలని, వారి రెమ్యునరేషన్లో ఎంతో కొంత తగ్గించుకొని సహాయం చెయ్యాలని నిర్మాత డి.సురేష్‌బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోరారు.













