మరో మూడు నెలలు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు
ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల్ని బట్టి కొన్ని రంగాలకు ఇప్పట్లో పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపించడం లేదు. వాటిలో మొదటి అంశం సినిమా థియేటర్స్. మూడు నెలలుగా మూసి వున్న థియేటర్స్ వల్ల ఎగ్జిబిటర్స్ ఎంతో నష్టపోయారు. తాజాగా షూటింగులు ప్రారంభించే విషయంలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాలతో షూటింగులు ప్రారంభించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయం చెప్పింది. అయితే అది ఎప్పటి నుంచి అనే విషయంలో ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. వాస్తవ పరిస్థితుల్ని విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత వరకు లాభం ఉంటుంది? ఎన్ని విధాలుగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందనే విషయంలో నిర్మాత డి.సురేష్‌బాబు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా థియేటర్స్ మూసేయడం వల్ల 50,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. థియేటర్ యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది.
ఆగస్ట్ నుంచి థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. థియేటర్స్ ఓపెన్ చేస్తే నష్టాలు తప్పవని సురేష్‌బాబు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. మరో మూడు నెలలు ఆ ఆలోచన చేయకుండా ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే చైనా, దుబాయ్ దేశాల్లో థియేటర్లు ఓపెన్ చేశారు. కానీ, అక్కడ ఆక్యుపెన్సీ శాతం కేవలం 2 శాతం మాత్రమే ఉంది. దీన్నిబట్టి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రారంభిస్తే ఎలాంటి పరిణామం ఎదురవుతుంది? అసలు ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చి మునుపటిలా సినిమాను ఎంజాయ్ చెయ్యగలుగుతారా? అనేది సురేష్‌బాబు ప్రశ్న. ఆక్యుపెన్సీ దారుణంగా ఉన్న కారణంగా చైనాలో మళ్లీ థియేటర్స్ మూసేశారు. అందుకే మేం ఈ విషయంలో తొందరపడదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇప్పుడు థియేటర్లను తెరిస్తే.. మున్ముందు ఎగ్జిబిషన్ పరిశ్రమ మనుగడ సాగించడం కష్టమవుతుంది అంటున్నారు సురేష్‌బాబు. మరి ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో, ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటాయో చెప్పడం ఎవ్వరికీ సాధ్యమయ్యే విషయం కాదు.













