ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతికి సంతాపాన్ని తెలిపిన భారత సినీ పరిశ్రమ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను సినీ నటులతో పాటు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. 16 భాషలలో షుమారు 40 వేల పాటలను ఆలపించిన గొంతు ఇక మూగబోయిందని తెలిసి ఎవరికీ నోట మాట రావడం లేదు. నేడు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలు ఈ లోకం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని యావత్ సినీ పరిశ్రమ సంతాపాన్ని తెలియ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ తన సంతాపాన్ని వీడియో ద్వారా మీడియా కి తెలియ చేసారు. మెగా స్టార్ చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటిస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసారు. కృష్ణం రాజు, మంచు మోహన్ బాబు,, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, నందమూరి కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాని, నితిన్, నాగ సౌర్య, దర్శకులు కె రాఘవేంద్ర రావు, యస్ యస్ రాజమౌళి, వి వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, గుణశేఖర్, నిర్మాతలు సి అశ్వని దత్, సురేష్ బాబు, నాగ వంశి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ :. “చాలా ఏళ్లుగా సినిమాల్లో నాకు డబ్బింగ్ చెప్పారు. మీ గొంతు, మీ జ్ఞాపకాలు నాతో ఎల్లప్పటికీ సజీవంగా ఉంటాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ఎస్పీ బాలు గురించి మాట్లాడిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, బోనీ కపూర్, మలయాళ రంగం నుండి మోహన్‌లాల్, మమ్ముటి ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియ చేసారు. మరోవైపు గురువారం ఎస్పీ బాలును ఆఖరుసారిగా పరామర్శించి వచ్చిన ప్రముఖ హీరో కమల్ హాసన్ కూడా మరణవార్త తెలిసి ఉద్వేగభరితులయ్యారు. బాలుతో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ ఒక దగ్గర చేర్చిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కాగా ఎస్పీ బాలు.. సిప్పిక్కుల్ ముత్తు, మైఖెల్ మదన కామరాజు, భామనే సత్యభామనే, అభయ్, సత్యమే శివం, ముంబై ఎక్స్‌ప్రెస్, దశావతారం, మన్మథ బాణం అనే సినిమాల్లో కమల్ హాసన్‌కు డబ్బింగ్ చెప్పారు.
రజనీ కాంత్‌తో పాటు జెమిని గణేశన్, నరేష్, సుమన్, మోహన్ లాల్, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, టిను ఆనంద్, అర్జున్, నాగార్జున (అన్నమయ్య తమిళ డబ్బింగ్) నాజర్‌లకు డబ్బింగ్ చెప్పారు.













