ఎట్టకేలకు మొదలైన ఉయ్యాలవాడ
దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నంబర్ 150 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి తనయుడు రాంచరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ ప్రారంభమైంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోతవ్సం కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రాంచరణ్‌తో సహా నిర్మాత అల్లు అరవింద్, పరుచూరి సోదరులు హాజరయ్యారు. ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.













