Chiranjeevi: ‘వేవ్స్’ కమిటీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది.. ప్రధాని మోదీకి చిరంజీవి ధన్యవాదాలు
అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (Waves)’ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ సినీ, పారిశ్రామిక ప్రముఖులందరితోనూ ప్రధాని నరేంద్ర మోదీ(Modi) వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం చేశారు. ఈ మేరకు చిరంజీవి(Chiranjeevi) తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ప్రధాని మోదీ శుక్రవారం నాడు వేవ్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఇందులో చిరంజీవి, సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజినీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ కుమార్, రణ్ బీర్ కపూర్, దీపిక పదుకొణె వంటి వారు పాల్గొన్నారు.
ఆర్థిక రంగం కోసం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎలా జరుగుతుందో.. వినోద పరిశ్రమ కోసం అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా WAVES (వేవ్స్)ను రూపొందిస్తున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.













