ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’
బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తో మెగా స్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి‘
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సినిమా టీజర్ ఆగస్టు 21,2018 న చిరంజీవి 63వ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయ్యింది.
చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా సినిమా తీయాలని చాలా కాలంగా చర్చలు నడిచాయి. అయితే వివిధ నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావటంతో విసిగిపోయి చివరికి ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా రాంచరణ్ జూలై 2017లో ప్రకటించాడు.
“తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద సినిమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. దీనికి బడ్జెట్ ఇంత అని కేటాయించలేదు. నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతటినీ నేనే భరిస్తాను. ఎందుకంటే ఈ సినిమా, నాన్నగారి చిరకాల స్వప్నం” అని టీజర్ విడుదల తర్వాత ఒక ముఖాముఖిలో రాం చరణ్ తెలిపారు.
“నీ రెండవ సినిమాలోనే నువ్వు యుద్ధవీరుని పాత్ర పోషించావు. 150 సినిమాలు చేసినా నాకు అలాంటి అవకాశం రాలేదు. ” అని నాన్నగారు నా తో ఒక మారు అన్నారు. ఈ పాత్రపై ఆయనకు ఒకింత ఈర్ష్య కూడా కలిగింది. ఆ రోజు నుండే ఆయన కలను నిజం చేయటానికి ఇటువంటి చిత్రం నిర్మించాలని అనిపించేదని రాం చరణ్ తెలిపారు.
సురేందర్ రెడ్డి వంటి యువ దర్శకుడు ఇంత భారీ ప్రాజెక్టుకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగలరా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ “ప్రతిభకు మాకు కొదవ లేదు. అన్ని రకాల సినిమాలు చేయాలి. సినిమా కోసం తాను చేసిన పరిశోధన, అందించిన పకడ్బందీ స్క్రిప్టుతో మేము అనుకొన్న దానికంటే సురేందర్ చాలా ఎక్కువగానే కష్టపడ్డాడు.” అని రాం చరణ్ తెలిపారు.
సినిమా విజయవంతం అవుతుందా అనే ప్రశ్నకు “జయాపజయాల గురించి నేను పెద్దగా పట్టించుకోదలచుకోలేదు. ఫలితం ఏదయినా నేను సంతోషంగానే ఉంటాను ఎందుకంటే నాన్నగారి కలను నిజం చేయటానికి మేము శాయశక్తులుగా ప్రయత్నిస్తున్నాము. స్క్రిప్టుకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాము. వ్యక్తిగతంగా మాత్రం అన్ని రికార్డులను ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టాలని నేను కోరుకొంటున్నాను.” అని తెలిపారు.
ఇదే ముఖాముఖిలో సురేందర్ రెడ్డి, “మేము చాలా పరిశోధించాం. బ్రిటీషు ప్రభుత్వం నరసింహారెడ్డికి విధించిన మరణ శిక్షలో అతని గురించి క్షుణ్ణంగా తెలిపింది. 10,000 మంది సైన్యంతో నరసింహారెడ్డి బ్రిటీషు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చిరంజీవిగారి సినిమాలను మొదటి వరుసలో కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు ఆయన సినిమాకే దర్శకత్వం వహించటం, పైగా అమితాబ్ వంటి వారు ఈ సినిమాలో ఉండటం నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. అమితాబ్ గారైతే కేవలం చిరంజీవిగారి కోసమే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. తర్వాత నేను కథ చెప్పటంతో అది ఆయనను ఆకట్టుకొంది. వారు సంతోషంగా సినిమా చేయటానికి అంగీకరించారు.” అని తెలిపారు.
“1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. ఈయన పాలెగార్ మనవడు నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్లుప్త కథ.”
300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం లో నటీనటులు :ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా చిరంజీవి, గురువు గోసాయి వెంకన్న – అమితాబ్ బచ్చన్, సిద్ధమ్మ (నరసింహారెడ్డి ధర్మపత్ని) – నయనతార, నరసింహా రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచే ఒక రాజు పాత్ర లో రాంచరణ్, వ్యాఖ్యాతగా అల్లు అర్జున్, ఓబయ్య – విజయ్ సేతుపతి, అవుకుకు చెందిన రాజు – సుదీప్, మైరా రెడ్డి గా జగపతి బాబు, లక్ష్మి గా తమన్నా, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సహాయకుడిగా బ్రహ్మజీ, తదితరులు నటిస్తున్నారు. బ్యానర్ : కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, సినిమాటోగ్రఫీ:ఆర్ రత్నవేలు,ఎడిటర్ : ఏ శ్రీకర్ ప్రసాద్,సంగీతం: అమిత్ త్రివేది, మాటలు: పరుచూరి బ్రదర్స్, నిర్మాత : రామ్ చరణ్, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.













