“సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను!”… మెగాస్టార్ చిరంజీవి
పెద్దరికం పదవి నాకొద్దు.. ఆ స్థానమే నాకొద్దు.. ఆపదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా” అని మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ఎంతోమంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని.. అలాంటివారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్‌లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సినీ కార్మికులు మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి గత కొంతకాలంగా పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరని.. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా కోరారు. మీరు పెద్దగా ఉంటే, తమకు ఏదైనా సమస్య వస్తే వెంటనే చిరు ఉన్నారనే ధైర్యం ఉంటుందని మెగాస్టార్‌ను కార్మికులు కోరారు. దీనికి స్పందించిన చిరు పై వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ..” 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం చాలా ఆనందంగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. హెల్త్ కార్డ్ క్యూఆర్ కోడ్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకూ 7,699 కార్డులు సిద్దమయ్యాయి. మిగతావి కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. షూటింగ్లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసువాలి. ఇకపై ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను’’ అని చిరు చెప్పుకొచ్చారు. ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా అండగా ఉంటానని.. అంతేకాదు వారిని ఆదుకుంటానని మెగాస్టార్ స్పష్టం చేశారు.













