చిరూ చెప్పిన గొప్ప పాఠం
సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకే కాదు, వేరే రంగాల వాళ్లకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఓ పెద్ద ఇన్స్పిరేషన్. ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎందరో నటులను ఢీకొట్టి నంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడమంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్ కు రావడానికి చిరూ ఎంత కష్టపడ్డాడనేది అతని జర్నీ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్నో రకాలుగా ఇన్స్పైర్ చేసిన చిరూ, తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో చిరూ ఎన్నో స్పూర్తి నింపే విషయాలను చెప్పాడు. అందులో ఓ పాయింట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రతీ వ్యక్తి ఈ విషయాన్ని నేర్చుకోవాలనే అంశాన్ని చిరూ ఆ కార్యక్రమంలో డిస్కస్ చేశాడు.
న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో తాను ఫ్లోర్ బయటుండగా, షాట్ రెడీ అవగానే తను లోపలికి పిలిస్తే వెళ్లానని, అప్పుడు ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ తనను చూసి ఫ్రస్టేట్ అయ్యాడని, మీరేమైనా సూపర్ స్టార్స్ అనుకుంటున్నారా? ఇక్కడే ఉండొచ్చుగా, మిమ్మల్ని మళ్లీ ఇంకొకరు పిలవాలా అని అరిచాడని, ఆయన అలా అన్నందుకు చాలా బాధ పడ్డాడని చిరూ తెలిపాడు. కానీ కాసేపటి తర్వాత అదే నిర్మాత ఫోన్ చేసి వేరే ఫ్రస్టేషన్ మీ మీద చూపించినందుకు సారీ చెప్పాడని అన్నారు. కానీ మీరేమైనా సూపర్ స్టార్లు అనుకుంటున్నారా అనే మాట తన హృదయానికి బలంగా తాకిందని, ఆ సమయానికి బాధ పడ్డా కూడా ఆ మాటను పట్టుకుని నిజంగానే సూపర్ స్టార్ అవుదామని కష్టపడ్డానని, దాని ఫలితమే ఇవాళ తాను అందుకున్న స్థాయి అని చిరూ చెప్పుకొచ్చాడు. ఎవరైనా మనల్ని అవమానించేలా మాట్లాడినా అందులోంచి కూడా ఓ సానుకూల విషయాన్ని తీసుకుని ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని చిరూ చెప్పిన మెసేజ్ అందరినీ ఆకర్షిస్తుంది.













