‘లూసిఫర్’ రీమేక్‌లో మెగాస్టార్‌తోపాటు మెగా హీరోలు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత మలయాళ సూపర్‌హిట్ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ చెయ్యబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. చాలా కాలం క్రితమే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుంది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఇదిలా ఉంటే ఆమధ్య ఈ సినిమాలో అలు్ల అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని కొట్టి పారేశారు అతని సన్నిహితులు. తాజాగా ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది. హీరో క్యారెక్టర్‌కి సరిసమానంగా ఉండే ముఖ్యమంత్రి పాత్రను పవన్ పోషించే అవకాశం ఉంది. ఆ క్యారెక్టర్ పవన్ చేస్తేనే బాగుంటుందని చిరంజీవి రికమెండ్ చేశారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతేకాదు పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘లూసిఫర్’ చిత్రంలో పృథ్విరాజ్ పోషించిన పాత్రలో రామ్‌చరణ్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘సాహో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. 2019లో విడుదలైన ‘లూసిఫర్’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. నటుడు, దర్శకుడు పృథ్విరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రం రూపొందుతోంది. 2021లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.













