మహానటి బృందానికి మెగాస్టార్ సత్కారం
సావిత్రి జీవితచరిత్రను మహానటి పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకదత్లు నిర్మించారు. కీర్తిసురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. బయోపిక్ అంటే ఇలా ఉండాలి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నారు. మొదటి నుంచి కూడా మహానటిని తెరకెక్కించే నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తోన్న చిరంజీవి, తాజాగా నాగ్ అశ్విన్ తో పాటు ప్రియాంకదత్, స్వప్నదత్లను తన ఇంటికి ఆహ్వానించాడు. మహానటిగా అందంగా, హృద్యంగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయినందుకు, తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగిన ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ సత్కరించారు.













