ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిన మెగాస్టార్
భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్లు, ఏవీ లేకపోతే ఏదొక రియాలిటీ షో పేరుతో అయినా సరే ఓటీటీలోకి ఎంటరై ఆడియన్స్ కు చేరువ అవుతున్నారు. టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఓటీటీ కంటెంట్ కు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే అగ్రతారలు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఏదొక రూపంలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చిరంజీవి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చిరూ రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్కు సైన్ చేసినట్టు సమాచారం. తన ఇమేజ్ కు తగ్గ కంటెంట్ ఉంటే వెబ్ సిరీస్ చేస్తానని మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చిరూ చెప్పాడు.
ఇన్నాళ్లకు అది ఫలించింది. మెగాస్టార్ చెప్పిన దాని ప్రకారం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో కలిసి వెబ్ సిరీస్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కానీ అదెలాంటి సిరీస్, ఏ ప్లాట్ ఫామ్ లో చేస్తున్నారనేది మాత్రం ఇంకా తెలీదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు.













