అభిమాని కుమార్తె పెళ్లికి మెగాస్టార్ సాయం
అభిమానుల విషయంలో దాతృత్వంగా వ్యవహరిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. వారిపట్ల తనకున్న సహృదయాన్ని తాజాగా ఆయన మరోసారి చాటుకున్నారు. కుమార్తె పెళ్లి విషయంలో ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న ఓ అభిమానికి చిరు రూ.లక్షను సాయంగా పంపించారు. మహబూబాబాద్‌కు చెందిన భువనగిరి శేఖర్ అనే వ్యక్తి 30 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమాని. మెగాస్టార్‌కు సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని చిరుకి అత్యంత ఆత్మీయమైన అభిమానిగా మారాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శేఖర్ మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల శేఖర్ కుమార్తె వివాహం నిశ్చయమైంది. తన కుమార్తె పెళ్లి చేయడానికి శేఖర్ పడుతున్న ఆర్థిక ఇబ్బందులను మెగాస్టార్ యూత్ సభ్యులు చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన చిరు… శేఖర్‌కు సాయం అందించారు. ఈ మేరకు చిరు బ్లడ్‌బ్యాంక్ సీఈవో స్వామినాయుడు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్.. శేఖర్ కుటుంబసభ్యుల్ని కలిసి రూ.లక్ష చెక్కును అందించారు. చిరంజీవికి చిన్నప్పటి నుంచి నేను అభిమానిని. నా ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుని సాయం చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని శేఖర్ అన్నారు.













