చిరంజీవి , బాలకృష్ణ లతో మల్టీ స్టారర్ సినిమా రాబోతోందా??
సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్‌కి ఎప్పడూ డిమాండ్ ఉంటుంది. బాలీవుడ్లో మల్టీ స్టారర్ మూవీస్ అన్ని దశకాల్లోనూ వచ్చాయి. ఎంత పెద్ద హీరో అయినా అక్కడ మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యడానికి ముందుకొస్తారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే ఈ ట్రెండ్ తక్కువనే చెప్పాలి. అయితే పాత తరం హీరోల్లో అలాంటి పట్టింపులు ఏమీ ఉండేవి కావు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు.. ఇలా అందరు హీరోలూ మల్టీ స్టారర్స్ చేసినవాళ్లే. 1980 తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ఆ తర్వాత వచ్చిన పవన్‌కల్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, మహేష్ వంటి హీరోలు మల్టీ స్టారర్స్ పట్ల అంత ఆసక్తి చూపలేదన్నది నిజం. ఆ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరైన కథ దొరకాలిగా అంటూ తప్పించుకునే వారు. అయతే వెంకటేశ్ ఆ సంప్రదాయానికి బ్రేక్ వేశారు. ఏ హీరోతోనైనా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మహేష్‌తో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, పవన్‌కల్యాణ్‌తో `గోపాల గోపాల`, నాగచైతన్యతో `వెంకీమామ` వంటి సినిమాలు చేసి మల్టీ స్టారర్స్‌కి మరోసారి శ్రీకారం చుట్టారు. మల్టీ స్టారర్స్ చెయ్యాలన్న కోరిక ఉన్న హీరోలకు స్ఫూర్తిగా నిలిచారు.
తాజాగా టాలీవుడ్లో మరో మల్టీ స్టారర్ రాబోతోందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. పరుచూరి బ్రదర్స్ చాలా కాలం క్రితమే చిరంజీవి, బాలకృష్ణ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందని టి.సుబ్బరామిరెడ్డికి సూచించారట. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ ఈ మల్టీ స్టారర్ కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన పక్కా స్ర్కిప్ట్ రెడీ అవుతుందని సమాచారం.
గతంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ చెయ్యబోతున్నట్టు టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. కానీ, ఆ సినిమా సెట్స్ వరకు వెళ్లలేదు. మరి ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఈ మల్టీ స్టారర్ షూటింగ్ వరకు వెళుతుందో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే..













