‘బీ ది రియల్ మెన్’ ఛాలెంజ్ తో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసే వాడే నిజమైన మగాడు అంటూ ‘బి ది రియల్ మేన్’ అనే ఛాలెంజ్ ప్రారంభించాడు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అందరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో వాళ్లకు ఇంటి పనుల్లో తోచిన సాయం చేయమని చెప్పడమే ఈ చాలెంజ్ ఉద్దేశ్యం. ఇప్పటికే సందీప్ రెడ్డి.. ఈ ఛాలెంజ్‌కు రాజమౌళిని నామినేట్ చేసాడు. జక్కన్న కూడా ఇంట్లో పనులు చేసి ఈ ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు సుకుమార్‌తో పాటు కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా దర్శకుడు రాజమౌళి ‘బి ది రియల్ మెన్’ ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడంతో పాటు ఇంట్లో బాసాన్లు కడిగి తన భార్యకు సహాయం చేసాడు.
అంతేకాదు సుకుమార్.. నిర్మాత దిల్ రాజు, దర్శకులు సురేందర్ రెడ్డి, కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఈ ఛాలెంజ్ స్వకరించమని ఛాలెంజ్ విసిరాడు. అయితే విక్టరీ వెంకటేష్ ఓ మెలిక పెట్టాడు మా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తే నేను రెడీ అన్నట్టుగానే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి వక్క్కుమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రం చేసి కిచన్ లో పెసరట్టు వేసి తన తల్లి అంజనా దేవి కి వడ్డించాడు. ఆ తల్లి తిరిగి ఓ ముక్క నోట్లో పెట్టడం వంటివి ట్విట్టర్ లో ఛాలెంజ్ ను స్వీకరించి చాటుకున్నాడు. ఇది జరిగిన మరు క్షణం విక్టరీ వెంకటేష్ కూడా ఇల్లు శుభ్రం చేసి కిచన్ పని పట్టి గార్డెనింగ్ తో తన ఛాలెంజ్ ను స్వీకరించాడు. మొత్తానికి లాక్డౌన్లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఇపుడు ఇంట్లో పనులు చేస్తూ.. అభిమానులతో ప్రజలకు కూడా ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేయమని మంచి సందేశం ఇస్తున్నారు.













