‘సైరా’లో చిరంజీవి, నయనతార ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నమెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరుకు గురువుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్ స్టార్స్ నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి వారు ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నానక్‌రామ్‌గూడలో వేసిన భారీ సెట్లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. రెండు రోజుల క్రితం అమితాబ్ తన బ్లాగ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసి దాదాపు అదే గెటప్‌లో తాను కనిపించబోతున్నట్టు తెలియజేశాడు.
తాజాగా సినిమాలో చిరంజీవి, నయనతార లుక్‌ను అమితాబ్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిరు, నయన్ యాగంలో కూర్చోవడం, పక్కనే ఉన్న అమితాబ్ దంపతులపై అక్షింతలు చల్లుతున్నట్లుగా ఉన్న ఈ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవితో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని అమితాబ్ తెలుగులో ట్వీట్ చేశారు.













