గద్దర్ అవార్డ్స్ పై ‘చిరు’ మాట
తెలంగాణ సీఎం తాము అనౌన్స్ చేసిన గద్దర్ అవార్డ్స్ కు ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ రాలేదని ఓ సభలో బహిరంగంగా చెప్పడంతో ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఎప్పుడో కనుమరుగైపోయిన నంది అవార్డుల ప్లేస్ లో వీటిని ప్రవేశపెడతామని చెప్పి నెలలవుతున్నా వాటికి సంబంధించిన చర్యలకు ఎలాంటి కదలిక కనిపించలేదు.
ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులను నటీనటులెంతో గర్వంగా భావించేవారు. నంది అవార్డులను టాలీవుడ్ ఆస్కార్స్ అని పిలుచుకునేవారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ అవార్డుల బహుకరణ జరిగింది కనీ తర్వాత కొన్ని కారణాల వల్ల వీటిని ఆపేశారు. ఆ తర్వాత దాన్ని పునరుద్దరించే దిశగా ఎవరూ ఆలోచించలేదు కూడా.
ఇప్పుడు స్వయంగా సీఎం చెప్పాక కూడా ప్లానింగ్ చేసుకోకపోతే నష్టం లేకపోయినప్పటికీ నటీనటులు గౌరవాలు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లవుతుందని వీలైనంత త్వరగా మా అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సమాఖ్య సంయుక్తంగా దీనికి సంబంధించిన కార్యాచరణకు పూనుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు.













