శంకర్-చరణ్ సినిమాపై సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా? ఆ సెంటిమెంట్‌తో చరణ్ ఫ్యాన్స్ దిగాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో రానుందన్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు 50వ సినిమా కావడంతో దిల్ రాజు కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇండియాలోనే భారీ సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నశంకర్ దర్శకత్వంలో సినిమా కాబట్టి ఇది చరణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని కొందరు నమ్ముతుంటే, చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఒక సెంటిమెంట్ ను పెట్టుకుని దాంతో దిగాలు పడుతున్నారు.
ఆ సెంటిమెంట్ ఏంటంటే చరణ్ చేసిన 3 మల్టిప్లికేషన్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలుగా మిగలడమే. అంటే.. చరణ్ మూడవ సినిమా ఆరెంజ్. మంచి మ్యూజికల్ ఆల్బమ్ తో ఆకట్టుకున్న ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగబాబు కు చాలా నష్టాన్నే మిగిల్చింది. ఇక ఆరవ సినిమా తుఫాన్. అది కూడా అంతే. తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో వచ్చిన బ్రూస్ లీ దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. ఇక రీసెంట్ గా ఇండస్ట్రీ హిట్ అయిన రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వీటన్నింటినీ చూసి ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా అంటే ఫ్యాన్స్ మాత్రం ఈ సెంటిమెంట్ మనసులో పెట్టుకుని నిరాశతోనే ఉన్నారు.
ఇకపోతే అటు శంకర్ నుంచి కూడా ఈ మధ్య తన రేంజ్ సినిమాలు రావడం లేదు. ఐ సినిమా బాగున్నప్పటికీ అది శంకర్ రేంజ్ సినిమా అని అయితే చెప్పలేం. ఇక రీసెంట్ గా వచ్చిన రోబో2 అయితే శంకర్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తన వీక్ డైరక్షన్ అంటే అదేనేమో అన్నట్లుంటుంది. మరి ఇలాంటి టైమ్ లో శంకర్… చరణ్ ఫ్యాన్స్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి హిట్ ఇస్తాడా అన్నది చూడాలి.













