ఏం తెలియకుండానే పాట రాస్తామా..?అంటూ ఫైర్ అయిన లిరిసిస్ట్ చంద్రబోస్..
టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ తనపై వచ్చిన విమర్శలకి రీసెంట్ గా స్పందించారు. పాట గురించి తెలియాలంటే రసికత ఉండాలి, తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అప్పుడే పాట అర్థం అవుతుంది అని ఆయన అన్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రానికి రాసిన ఒక పాట విషయంలో ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ని చంద్రబోస్ ఇచ్చారు.
చంద్రబోస్ ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సూటిగా యండమూరికే జవాబు చెబుతున్నాను అంటూ గట్టిగా మాట్లాడారు. ఏమీ అవగాహన లేకుండా పాటలు రాస్తారు అనుకుంటే అంతకంటే పిచ్చితనం మరోకటి లేదని అన్నారు. తనకు తిమిరానికి కూడా అర్థం తెలియదని మరో సాటి రచయిత అనుకోవడం కంటే తిమిరం లేదని గట్టిగానే బదులిచ్చారు. తాను వాల్తేరు వీరయ్యలో హీరో లక్షణాలను ఉద్దేశిస్తూ రాసిన పాట అంత విరోధాభాస అలంకారంలో సాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
పక్కన పక్కనే ఉన్న రెండు పదాలకు విరోధం ఉంటుందని, రెండింటికీ పొసగదు అని కానీ ఆ రెండు పదాల అర్ధం లోతుగా చూస్తేనే పాట అర్ధమవుతుందని చంద్రబోస్ అన్నారు. తాను రాసిన పాటలో తుఫాన్ అంచున తపస్సు చేసుకునే ప్రశాంతుడు వశిష్టుడు అని ఉంటుందని, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్టుడికి సాటి ఎవరూ లేరని, అలాంటి ఆయన అలజడులు ఎన్ని రేగినా ప్రశాంతతో ఉండడమే గొప్పతనం, అదే తత్వం అని రాశాను అన్నారు. తన పాట గురించి ఈ సందర్భంగా చక్కటి విశ్లేషణ ఇచ్చారు చంద్రబోస్.
యముడు ఎక్కడైనా కవిత్వం రాస్తారా అని ఎవరైనా సెటైర్లు వేయవచ్చు కానీ అది కూడా విరోధాభాసమే అని ఆయన అన్నారు. యముడు కళాత్మకంగా చంపుతున్నాడు అన్న అర్ధం వచ్చేలా తాను పాటలో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ రాయడం జరిగింది అని చంద్రబోస్ అన్నారు. మరో వైపు చూస్తే తిమిర నేత్రుడై ఆవరించిన త్రినేత్రుడు అని రాయడం వెనక అవతల శతృవుకి చీకటి చూపించి అంతా శూన్యంగా చేసి తాను మాత్రం త్రినేత్రుడి మాదిరిగా యుద్ధం చేసే ధీరోధాత్తుడుగా రాశాను అని ఆయన వివరించారు.
తన పాటను విమర్శించే వారు లోతైన అసలు అర్ధాలను చూడాలని ఆయన అన్నారు. ఇక తిమిరం అన్న అర్ధం కూడా తెలియనంతగా తాను లేను అంటూ ఆయన యండమూరికి చురకలు అంటించారు. మరి చంద్రబోస్ వేసిన ఈ కౌంటర్ కి యండమూరి ఎలా స్పందిస్తారో చూడాలి.













