చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ టు టాలీవుడ్ ఎక్కడ చూసిన బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి బయోపిక్ మహానటి బ్లాక్ బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్‌లు సైతం చిత్రీకరణలో దశలో ఉన్నాయి. ఇందులో చంద్రబాబు నాయుడు బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రోదయం పేరుతో సినిమా తెరకెక్కుతోంది. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను నేడు విడుదల చేశారు. అక్టోబర్ 18న సినిమా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలోనే ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో చంద్రబాబు బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాము. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేశాము. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నారు. భాస్కర్ ఎన్టీఆర్‌గా కన్పిస్తారు. చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్‌లో చూపిస్తామన్నారు.
నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సెప్టెంబర్ 1కి 23 సంవత్సరాలవుతోంది. ఈ సందర్భంగా మా చిత్ర ఫస్ట్ లుక్ పొస్టర్ ను విడుదల చేస్తున్నాము. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్కు తాము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.













