Dada Saheb Phalke: బయోపిక్ పై దాదా సాహేబ్ మనవడు క్లారిటీ

సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మక పురస్కారం దాదాసాహేబ్ ఫాల్కే(Dada Saheb Phalke) అవార్డని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి దాదాసాహేబ్ ఫాల్కే జీవిత కథపై ఇప్పుడు సినిమా తీస్తున్నారనే వార్త గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ బయోపిక్ కోసం రెండు టీమ్స్ ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి.
రాజమౌళి(Rajamouli) సమర్పణలో కార్తికేయ(Karthikeya), వరుణ్ గుప్తా(Varun Gupta) ప్రొడ్యూసర్లుగా నితిన్ కక్కర్(Nithin Kakkar) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా టాలీవుడ్ లో ఈ సినిమా రానుందని నాలుగు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అదే బయోపిక్ అమీర్ ఖాన్(Amir Khan)- రాజ్ కుమార్ హిరాణీ(Raj Kumar Hirani) కాంబోలో రూపొందనుందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ రెండు టీమ్స్ లో ఎవరు ఈ బయోపిక్ ను తీస్తారనే విషయంలో దాదాసాహేబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ(Chandra Sekhar Sri Krishna) క్లారిటీ ఇచ్చారు.
రాజమౌళి సమర్పణలో ఈ బయోపిక్ వస్తుందనే వార్తలు తాను కూడా విన్నానని, కానీ ఆయన్నుంచి కానీ అతని టీమ్ నుంచి కానీ ఎవరూ తనను ఇప్పటివరకు సంప్రదించలేదని, రాజ్‌కుమార్ టీమ్ మాత్రం తనతో మూడేళ్ల నుంచి టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పలు విషయాలను తెలుసుకుంటూనే ఉందని చెప్పారు. ఆమీర్ ఖాన్ ఈ సినిమా చేయడం తనకెంతో ఆనందంగా ఉందని, దాదాసాహేబ్ భార్య పాత్రలో విద్యా బాలన్(Vidya Balan) ను తీసుకుంటే బావుంటుందని కూడా అతను అభిప్రాయం వ్యక్తం చేశారు.