‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి 30 ఏళ్లు
తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అడపా దడపా కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తున్నాయి. అయితే అవి పది కాలాలపాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. అవి ఎప్పటికీ అందరికీ గర్తుండిపోయే సినిమాలు. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన టాప్ 25 మూవీస్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ కూడా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా విడుదలై మే 9 నాటికి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ అది నిన్న, మొన్న రిలీజ్ అయిన సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ సినిమా గురించి అనేక విశేషాలను తెలియజేస్తోంది.
అలా మొదలైంది
అసలు ఈ సినిమా ఎలా మొదలైందంటే… డైరెక్టర్ రాఘవేంద్రరావుతో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి ఒక లైన్ చెప్పాడట. ఆ లైన్ బాగా నచ్చడంతో ఎలాగైనా ఆ పాయింట్‌ను సినిమాగా తీర్చిదిద్దాలన్న కోరిక రాఘవేంద్రరావులో కలిగింది. ఆ తర్వాత ఈ కథలోకి జంధ్యాల, విజయేంద్రప్రసాద్, యండమూరి వీరేంద్రనాథ్ వంటి వారు వచ్చి చేరారట. వారందరి సహకారంతో ఒక అద్భుతమైన కథ సిద్ధమైంది.
టైమ్‌లెస్ క్లాసిక్
క్లాసిక్ చిత్రాల నిర్వచనం చెబుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ 25 చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు తప్పక స్థానం ఉంటుంది. ఇది పాత తరం సినిమా.. కొత్త తరం సినిమా అనే తేడా లేకుండా అన్ని తరాలను అలరించే టైమ్ లెస్ క్లాసిక్. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు.
సీక్వెల్ ప్రయత్నాలు..
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోందని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, శ్రీదేవి తనయ జాన్వి కపూర్ కలిసి నటిస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ సీక్వెల్ గురించి పలు సందర్భాల్లో హీరో చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ప్రస్తావించారు. ఈ సినిమా సీక్వెల్‌కు కథను రెడీ చేయిస్తున్నట్టు అశ్వనీదత్ తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని కూడా ఆయన అన్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరో హీరోయిన్లు ఎవరు? ఎవరు డైరెక్ట్ చేస్తారు? వంటి విషయాల గురించి మాత్రం అశ్వినీదత్ ప్రస్తావించలేదు.













