ట్రెండ్ మారింది.. మరి కృష్ణారెడ్డి కూడా మారతారా?
ఎస్.వి.కృష్ణారెడ్డి అనగానే ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు… ఇలా అన్నీ ఆ తరహా సినిమాలే గుర్తొస్తాయి. 1991లో కొబ్బరిబొండాం చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కృష్ణారెడ్డి. ఆ తర్వాత మాయలోడు చిత్రంతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారారు. అప్పటి నుంచి సాఫ్ట్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. యమలీల, శుభలగ్నం, మావిచిగురు, పెళ్లాం ఊరెళితే, ఆహ్వానం వంటి సినిమాలు కృష్ణారెడ్డిని ఫ్యామిలీ డైరెక్టర్ని చేశాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా విజయవంతం కాలేదు. అప్పటికే టాలీవుడ్లో ట్రెండ్ మారిపోవడంతో కృష్ణారెడ్డి సినిమాలకు ఆదరణ తగ్గింది. ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన సినిమా యమలీల2. 2014లో విడుదలైన ఈ సినిమా కూడా ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఆయన తాత్కాలికంగా డైరెక్షన్‌ను విరమించుకున్నారు. జూన్ 1 ఎస్.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా తను మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నట్టు సన్నిహితులతో చెప్పారని తెలుస్తోంది. అదే నిజమైతే ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి, చిరకాల మిత్రుడు కె.అచ్చిరెడ్డి. ఏ పనిచేసినా ఇద్దరూ కలిసే చేస్తారు. అలాగే సినిమాలు కూడా ఎక్కువ శాతం ఇద్దరూ కలిసి చేసినవే ఉంటాయి. అయితే కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్‌ని అచ్చిరెడ్డి నిర్మించే అవకాశం ఉంది.
ప్రజెంట్ ట్రెండ్‌లో తెలుగులో సినిమా చెయ్యాలంటే ఎలాంటి సినిమా చెయ్యాలి? అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒకప్పటి కృష్ణారెడ్డి మార్కు సినిమాలు చూసే అవకాశం ఇప్పుడు లేదు. థియేటర్‌కి వచ్చి సినిమా చూడడమే ఎక్కువ అనుకుంటున్న ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చెయ్యాలంటే ఏదైనా యునీక్ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యాలి. తను చేసే ప్రతి సినిమాకీ కథ, స్క్రీన్‌ప్లేతో సహా సంగీతం కూడా తానే సమకూర్చుకునే కృష్ణారెడ్డి ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు అవన్నీ చేయగలడా? అనేది అందరిలోనూ ఉన్న పెద్ద సందేహం. సినిమాకి ఎన్ని హంగులు అద్దినా అంతంత మాత్రంగానే ఆదరణ లభిస్తున్న ప్రస్తుత తరుణంలో కృష్ణారెడ్డి ఎలాంటి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారో, ఏ తరహా సినిమా రూపొందిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.













