బంపరాఫర్ కొట్టేసిన జెనీలియా
బొమ్మరిల్లు సినిమా గురించి, దానికున్న స్పెషల్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుకీ సిద్దార్థ్ డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారంటే దానికి కారణం ఈ సినిమానే. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ స్థాయి పెరిగిపోయింది. డైరెక్టర్ కు ఏకంగా ఈ సినిమా పేరే ఇంటిపేరుగా మారగా, నిర్మాత దిల్ రాజు కు బొమ్మరిల్లు సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక జెనీలియాకు ఈ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. హాసిని గా జెనీలియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది. ఇక అసలు విషయానికి వస్తే జెనీలియాకు ఇప్పటికీ అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. మొన్నామధ్య తన భర్త రితేష్ తో మజిలీ రీమేక్ చేసిన మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న జెనీలియాకు వెబ్ సిరీస్‌ల ఆఫర్లు బాగా వస్తున్నాయి.
వచ్చిన ఆఫర్లలో తనకు నచ్చిన వాటిని చేసుకుంటూ వెళ్తున్న జెనీలియాకు ఇప్పుడో బంపరాఫర్ వచ్చింది. అమీర్‌ఖాన్ తో జోడీ కట్టే ఛాన్స్ జెన్నీని వరించింది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో వస్తున్న సితారే జమీన్ పర్లో అమీర్ సరసన జెనీలియాను తీసుకోవాలని డైరెక్టర్ అనుకుంటున్నాడట. హాలీవుడ్ ఛాంపియన్స్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా జెనీలియా క్యారెక్టర్ మానసికంగా ఇబ్బందులు పడుతూ తర్వాత పెద్ద స్థాయికి వెళ్లే అమ్మాయిగా ఉండనుందట. ఏదేమైనా ఇలాంటి టైమ్ లో జెనీలియాకు ఈ ఆఫర్ రావడం తన అదృష్టమనే చెప్పాలి.













