బుచ్చిబాబు మామూలోడు కాదబ్బా!
బుచ్చిబాబు తన శిష్యుడే అయినప్పటికీ రెండో సినిమాకే అతను ఊహించుకున్న కాన్వాస్ తనకు షాక్ ఇచ్చిందని డైరెక్టర్ సుకుమార్ ఆర్సీ16 లాంచ్ లో చెప్పిన విషయం తెలిసిందే. చరణ్ ను హీరోగా అనుకోవడం, ఏఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఒప్పించడం లాంటివి మాత్రమే కాదు, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే బుచ్చిబాబు ఆ సినిమా కోసం చేస్తున్న ఆలోచనలు చూస్తే ఆయన నిజంగానే అసాధ్యుడు అనిపించడం ఖాయం.
సినిమా క్యాస్టింగ్ విషయంలో బుచ్చిబాబు అసలు వెనుకాడటం లేదు. ఇప్పటికే సంజయ్ దత్ ను విలన్ పాత్రకు ఒప్పించాడనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా తాత పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో ఎస్ చెప్పించుకునేలా ఉన్నాడంటున్నారు. ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్న అమితాబ్, సౌత్ నుంచి వచ్చే ఆఫర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు.
బుచ్చిబాబు చెప్పిన లైన్ నచ్చడంతో అమితాబ్ ఈ సినిమా పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా తెలుగు నేటివిటీ అయినప్పటికీ క్యాస్టింగ్ ను చూస్తుంటే ఆర్సీ 16 బాలీవుడ్ మూవీని తలపిస్తోంది. అంతేకాదు భారీ తారాగణం అవసరముండటంతో దానికి అనుగుణంగా బుచ్చిబాబు క్యాస్టింగ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ, కన్నడ నుంచి స్టార్ యాక్టర్లను ఎంపిక చేసిన బుచ్చిబాబు తమిళ, మలయాళం నుంచి కూడా నటులను తీసుకోవాలని చూస్తున్నాడట.













