Allu Arjun : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ or ఫుల్ స్టాప్..!?
పుష్ప 2 (Pushpa-2) ఘన విజయం సాధించడంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఫుల్ జోష్ లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. దీంతో సినిమా యూనిట్ అంతా దేశవ్యాప్తంగా సక్సెస్ మీట్స్ (success meet) నిర్వహిస్తోంది. ఇదే ఊపులో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి (politics) ప్రవేశించ బోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prasant Kishor) తో అల్లు అర్జున్ భేటీ అయ్యారని.. రాజకీయ ప్రవేశంపై ఆయన సలహాలు తీసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై అల్లు అర్జున్ టీమ్ (Allu Arjun Team) తాజాగా స్పందించింది.
అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి (Mega Family) మధ్య గ్యాప్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి (Silpa Ravichandra Reddy) ఇంటికెళ్లి మద్దతు ప్రకటించారు. ఇది జనసేన అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఓ వైపు వైసీపీ (YSRCP) ఓటమే ధ్యేయంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పనిచేస్తుంటే ఆ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడమేంటని విమర్శలు వచ్చాయి. నాగబాబు (Nagababu) కూడా ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత పవన్ ఘన విజయం సాధించారు. డిప్యూటీ సీఎం అయ్యారు. అయనా అల్లు ఫ్యామిలీతో వచ్చిన ఆ గ్యాప్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. ఇటీవల ఆహాలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరింత నిప్పు రాజేశాయి.
అల్లు అర్జున్ వ్యవహార శైలి మెగా ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయ్యేలా లేదని.. తన ఫ్యామిలీ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనేలా ఉందని అందరూ భావిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లూ మెగాస్టార్ (Megastar) మాటున ఉన్న అల్లు ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇందుకోసం ఎందాకైనా వెళ్లేందుకు వెనుకాడబోరని చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు కూడా అల్లు అర్జున్ సిద్ధమయ్యారనే వార్తలొచ్చాయి. ప్రశాంత్ కిశోర్ ను కలిశారని.. పదేళ్లపాటు సోషల్ సర్వీస్ చేశాక రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారని ఊహాగానాలు వినిపించాయి. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త పెద్ద సంచలనమే అయింది.
అయితే తాను రాజకీయాల్లోకి రాబోతున్నానన్న వార్తలపై అల్లు అర్జున్ టీమ్ ఎక్స్ లో స్పందించింది. అలాంటివన్నీ ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేసింది. అవన్నీ అసత్యకథనాలని పేర్కొంది. అలాంటి అసత్యకథనాలను మీడియా ప్రసారం చేసే ముందు కచ్చితంగా సంయమనం పాటించాలని సూచించింది. వాస్తవాలంటో తెలుసుకునేందుకు అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను చూడాలని.. వాటిని మాత్రమే నమ్మాలని కోరింది. అయితే అల్లు అర్జున్ నేరుగా ఈ ప్రకటన విడుదల చేయలేదు. అల్లు అర్జున్ టీమ్ అని మాత్రమే అందులో ఉంది. దీన్ని బట్టి ఇది అల్లు అర్జున్ తరపున ఆయన టీమ్ చేసిన ప్రకటనగా భావించవచ్చు. ఏమో భవిష్యత్తులో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావచ్చేమో..! ఏదైనా జరగొచ్చు.. చెప్పలేం..













