నితిన్ సినిమాకు బ్రేక్.. లైన్ లోకి మరో సినిమా!
దాదాపు రెండేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా పవర్ పేట. రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ క్రిష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన చల్ మోహన్ రంగ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఈసారి దానికి డిఫరెంట్ గా పూర్తి స్థాయి రస్టిక్ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమైంది నితిన్, క్రిష్ణ చైతన్య జోడీ. తన కెరీర్లోనే హై బడ్జెట్, హై రిస్క్ తో కూడిన సినిమా ఇదని నితిన్ ఈ మధ్యనే చెప్పుకొచ్చాడు.
ఆంధ్రాలో రౌడీయిజానికి కొలువైన పవర్ పేట అనే ప్లేస్ మీద ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా స్టోరీ రాసుకున్నాడట చైతన్య. ప్రస్తుతం నితిన్ చేస్తున్న మాస్ట్రో ఫినిష్ అవగానే ఈ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైమ్ కు మొదలయ్యేట్లు లేదని వార్తలొస్తున్నాయి. వక్కంతం వంశీ డైరక్షన్ లో నితిన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడన్న విషయం తెలిసిందే. కిక్, రేసుగుర్రం సినిమాలకు రచయితగా బ్లాక్ బస్టర్లు అందుకున్న వంశీ, దర్శకుడిగా మారి తెరకెక్కించిన నా పేరు సూర్య సినిమాతో ఘోర పరాజయాన్ని పొందాడు. ఇన్నాల్టికి ఆ దెబ్బ నుంచి కోలుకుని మళ్లీ సినిమాను లైన్ లో పెట్టాడు. ఫైనల్ గా నితిన్ తో సినిమాకు ఒప్పందం కుదిరింది.
పవర్ పేట ఖర్చు, శ్రమతో కూడుకున్నది కావడంతో, వంశీ సినిమాకు లేట్ అయ్యే అవకాశముందని, ముందు వంశీతో సినిమా చేసి, ఆ తర్వాత పవర్ పేట ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట నితిన్. వంశీ కూడా దానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. క్రాక్ తో ఈ యేడాది మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధంచిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.













