బ్రహ్మోత్సవం సినిమా ఇష్టమన్న కాజల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఎంతో చేదైన అనుభవం బ్రహ్మోత్సవం సినిమా. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో చేసిన ప్రమోషన్స్, ఇచ్చిన హైప్ అంత ఈజీగా మర్చిపోలేరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా మంచి కుటుంబ కథాచిత్రాన్నిచ్చిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. కానీ ఫస్ట్ షో తర్వాత రిజల్ట్స్ చూసి అందరూ చాలా నిరాశపడ్డారు.
అప్పట్లో ఈ రేంజ్ టెక్నాలజీ లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగి ఉండేది. అందుకే ఈ సినిమాలో నటించిన వారంతా ఎక్కడా ఈ సినిమా గురించి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ షాకిచ్చింది. తన కెరీర్లో ఇష్టమైన సినిమాల్లో బ్రహ్మోత్సవంలో చేసిన పాత్ర మొదటిదని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాకిచ్చింది.
వాస్తవానికి బ్రహ్మోత్సవంలో మెయిన్ హీరోయిన్ సమంతా. కాజల్ కనిపించేది కేవలం ఫస్టాఫ్ లో మాత్రమే. అయినా సరే కాజల్ ఇంత స్పెషల్ గా ఈ సినిమా గురించి చెప్పడం స్పెషలే. ఒక ఫ్లాప్ సినిమా గురించి కాజల్ గొప్పగా చెప్పడం అరుదైన విషయమే. పెళ్లి తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకున్న కాజల్ తిరిగి సత్యభామ తనకు బ్రేక్ ఇస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది.













