షకీలా…వల వల…
ఆమె ఒకనాడు దక్షిణాది ఆరాధ్య సెక్సీ నటి. సాక్షాత్తూ మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్స్ సైతం ఆమె సినిమాల పోటీ ధాటికి తమ సినిమాలు తట్టుకోలేకపోతున్నాయంటూ వాపోయిన పరిస్థితి. కొన్నేళ్ల పాటు మళయాళ సినిమా పరిశ్రమలో సెక్స్ సినిమాల వెల్లువకి సారధ్యం వహించారామె. ఎందరో యువ తారలకు అడ్డదారిగా ఓ కొత్త దారి చూపించారు. గత కొంత కాలంగా మళయాళ చిత్ర పరిశ్రమకన్నా ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు.
అలాంటి భారీ అందాల బ్యూటీ షకీలా ఇప్పుడు భోరుమంటున్నారు. చేతిలో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో పాటు అన్ని రకాలుగా వెనుకపడ్డ ఈ నిన్నటి తరం సెక్స్ బాంబ్.. శక్తి యుక్తులు మొత్తం ఖర్చు చేసి ఒక సినిమాని నిర్మించారు. లేడీస్ నాట్ అలౌడ్ పేరుతో షకీలా తనదైన పంధాలో తీసిన ఆ సినిమా గత కొంత కాలంగా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దాదాపు ఏడాదిన్నర పైనే సెన్సార్ చీకట్లలో ఇరుక్కుని వెలుగులోకి రాకుండా ఉండిపోయింది. దీనికి తోడుగా లాక్ డవున్ వచ్చి మీద పడడం.. దీంతో షకీలా పూర్తిగా దెబ్బతిన్నారు. పెట్టిన పెట్టుబడి కి ఫైనాన్షియర్ల వడ్డీలూ అన్నీ తడిసి మోపడు కావడంతో ఆమె పరిస్థితి తలకిందులైంది.
అడల్ట్ కామెడీగా పేర్కొంటున్న ఈ సినిమాని ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. టిక్కెట్ ధర రూ. 50గా నిర్ణయించారు. సోమవారం రాత్రి ఈ సినిమా ఆన్లైన్లో విడుదల కానుండడంతో షకీలా ఒక సెల్ఫీ వీడియో ద్వారా సినిమాను చూడమంటూ ప్రేక్షకుల్ని బ్రతిమాలారు. తను అన్ని విధాలుగా దెబ్బతిన్నానని, ఈ సినిమాయే తన చివరి ప్రయత్నమని ఆమె ఆ వీడియోలో బాధలు చెప్పుకున్నారు. తాను మళ్లీ సినిమా తీస్తానో లేదో గానీ… ఈ సినిమా జనం చూడకపోతే మాత్రం తన పరిస్థితి అగమ్యగోచరం కావడం తధ్యమంటున్నారు. మరి షకీలా వినతిని ఆమె అభిమానులు, ప్రేక్షకులు మన్నిస్తారా? ఒకనాటి తమ సెక్సీ క్వీన్ ముఖంలో చిరునవ్వులు పూయిస్తారా? అనే విషయం మరికొన్ని గంటల్లోనే తేలనుంది.













