ఆ సెంటిమెంట్‌ను బోయపాటి బ్రేక్ చేస్తాడా?
సక్సెస్ ల పరంగా చూసుకుంటే బోయపాటి శ్రీను కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడే. కానీ మిగిలిన స్టార్ డైరెక్టర్లకు ఉన్న గౌరవాన్ని మాత్రం బోయపాటికి దక్కట్లేదు. దానికి అతను చేస్తున్న సినిమాలే కారణం. ఎప్పుడూ అదే స్టోరీతో, సేమ్ నెరేషన్ తో ప్రేక్షకులకు మతి పోగొట్టడమే బోయపాటి చేస్తున్న తప్పు. తన మొదటి సినిమా భద్ర ను యూత్ ఫుల్ గా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన బోయపాటి, తన తర్వాతి సినిమాలన్నింటినీ మాస్ సినిమాలుగానే మలిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ ఫార్ములానే నమ్ముకుని సినిమాలు తీస్తూ తన కెరీర్ ను నడిపిస్తున్నాడు. కానీ బాలయ్య తో తను తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవడం వల్ల బోయపాటి ట్రేడ్ మార్క్ టాలీవుడ్ లో అలా నిలిచిపోయింది.
తను ఆఖరిగా బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా ఏ రేంజ్ హిట్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే బోయపాటి ఎంచుకున్న స్టోరీ, ఫార్ములా బాలయ్యతో సెట్ అయినట్లు మిగతా హీరోలతో మాత్రం సెట్ అవట్లేదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. సరైనోడు సినిమా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ టాక్ ను తట్టుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది.
మిగిలిన ఏ సినిమాతో కూడా బోయపాటి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇప్పుడు బోయపాటి, రామ్ తో చేస్తున్న సినిమాపై కూడా అందరికీ అదే అభిప్రాయముంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతి కంటెంట్, మాస్ ఆడియన్స్ కోసమే ఈ సినిమా అన్నట్లు అనిపిస్తున్నాయి. దానికి తోడు చాక్లెట్ బాయ్ అయిన రామ్ తో మరీ ఈ రేంజ్ వయలెన్స్ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని సెంటిమెంట్ల మధ్య స్కంద సినిమాతో బోయపాటి ఎలా గట్టెక్కుతాడో చూడాలి.













