స్కంద ఫైట్ కోసం అంత బడ్జెటా?
నాలుగున్నర కోట్లంటే ఎంత లేదన్నా చిన్న తరహా సినిమాలు రెండు తీయొచ్చు. కానీ ఈ బడ్జెట్ ను టైర్-2 హీరో రామ్ నటించిన స్కంద సినిమాలో కేవలం ఒక్క ఫైట్ కోసం పెట్టారట. వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు బోయపాటి శ్రీను నే వెల్లడించాడు. స్కంద సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ కోసం ఈ భారీ బడ్జెట్ను ఖర్చు పెట్టారట.
సినిమాలో హీరో ఇంట్రడక్షన్ హైదరాబాద్ పాత బస్తీలో జరిగే పండగ నేపథ్యంలో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పండగలో బర్రెల మధ్య పోటీ నిర్వహిస్తుండగా, దానికి గెస్ట్ గా సీఎం వస్తాడు. బర్రెలకు ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని అదుపు తప్పేలా చేసి, సెక్యూరిటీని, పోలీసులను డైవర్ట్ చేసి సీఎంను చంపేయాలని అతడి ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తే, ఆ టైమ్ లో హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ల ప్లాన్ ను చెడగొడతాడు.
బోయపాటి ఈ నేపథ్యంలో బుల్ ఫైట్ ను తెరకెక్కించాడు. ఇంకా చెప్పాలంటే చాలా భారీగా చిత్రీకరించాడు. రెగ్యులర్ ఫైట్లతో కంపేర్ చేస్తే ఈ ఫైట్ కొత్తగా ఉంటుంది కానీ వావ్ అనుకునే రేంజ్ లో మాత్రం ఈ ఫైట్ లేదనేది వాస్తవం. అలాంటి ఫైట్ కోసం ఏకంగా నాలుగున్నర కోట్లు పెట్టించాడంటే బోయపాటిని ఏమనాలని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అంతేకాదు ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం ఎక్కువ మొత్తంలో లైటింగ్, దాని కోసం 29 జనరేటర్లు, భారీ సంఖ్యలో బర్రెలను తెప్పించడం, వందల సంఖ్యలో పహిల్వాన్లను రప్పించడం, వీటన్నింటితో కొన్ని రోజుల పాటూ రిహార్సల్ చేసి ఈ సీక్వెన్స్ తీయడం వల్లే ఇంత భారీ మొత్తంలో ఖర్చైందని సమాచారం. ఏదైనా సరే కథలో కంటెంట్ ని నమ్మకుండా ఇలా భారీ బడ్జెట్తో ఫైట్లు తీస్తే సినిమాలు బ్లాక్ బస్టర్లు అయిపోవని బోయపాటి ఇకనైనా అర్థం చేసుకుంటే బెటర్.













