2023 అయినా బాలీవుడ్ కి లక్ కలిసొస్తుందా..?
2022 బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి డిజాస్టర్స్ ని ఎదుర్కుందో తెలిసిన విషయమే. ఆ సంవత్సరం బాలీవుడ్ కి బ్లాక్ ఇయర్ గా మిగిలిపోయిందని చెప్పొచ్చు. రెండు, మూడు దశాబ్దాలుగా లేనటివంటి పరిస్థితులు బాలీవుడ్ లో కనిపించాయి. వరుస ప్లాప్ లతో సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్స్ సినిమాలన్ని కూడా అత్యంత దారుణమైన ఫలితాలు అందించాయి.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం న్యూ ఇయర్ లోకి కోటి ఆశలతో అడుగు పెట్టింది. ఈ ఏడాది మాత్రం గతేడాది పరాజయాలన్నింటి లెక్క సరిచేయాల్సి ఉంది. ఈ తరుణంలో షారుక్ ఖాన్ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. సినిమా అనుకోగానే సంచలనాలు సృష్టించిన `పఠాన్` జనవరి 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది.
అలాగే జూన్ 2న యాక్షన్ ఎంటర్ టైనర్ “జవాన్” రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తర్వాత రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న “డంకీ” డిసెంబర్ లో రిలీజ్ అవబోతుంది. ఇలా ఏడాదంతా షారుక్ సందడి థియేటర్లో కనిపిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ” కీసికా భాయ్..కీసికా జాన్” ప్రేక్షకులని అలరించడానికి రెడీగా ఉంది.
వరుసగా నాలుగు డిజాస్టర్లను చవి చూసిన అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ హీరో నటిస్తోన్న “సెల్పీ” ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతుంది. ఇక రాక్ స్టార్ రణబీర్ కపూర్ ఆగస్టులో “యానిమల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలాగే మరో సినిమా “తూ ఝాటీ మై మక్కర్” హోళీ కానుకగా మార్చిలో రిలీజ్ అవుతుంది. “రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ” ఇదే ఏడాది రిలీజ్ కానుంది. ఇన్ని బ్లాక్ బస్టర్ల మధ్య బాలీవుడ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుందో లేదో చూడాలి.













