2022 బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు…
2022 బాలీవుడ్ కి కలిసిరాలేదని చెప్పాలి. బాలీవుడ్ లో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలే కనిపిస్తుంటాయి. ఈ ఏడాది వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాల కలెక్షన్స్ చూసి స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యారు. పెద్ద సినిమాల కన్నా చిన్నసినిమాలే ప్రేక్షకులని అలరించాయని, ఉత్తమ ఫలితాలు సాధించి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయని ఇండస్ట్రీలో టాక్.
ఈ దెబ్బకి స్టార్ హీరోలకు సౌండ్ లేకుండా పోయింది. రీసెంట్ గా 2022 లో రిలీజైన భారీ బడ్జెట్ సినిమాల వివరాల్లోకి వెళ్తే, రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘జయేష్‌భాయ్ జోర్దార్’ విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. బడ్జెట్ సహా కంటెంట్ భారీగానే హైలైట్ అయింది. రణ్ వీర్ సైతం ఈ చిత్రాన్ని ఒక ఎక్స్పరిమెంట్ లా భావించి నటించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఫలితాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి.
ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ధాకడ్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ లేడీ సూపర్ స్టార్ ప్రచార చిత్రాలతో ‘ధాకడ్’ పై ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసింది. బాలీవుడ్ రేంజ్ ని మార్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘విక్రమ్-వేద’ని అదే టైటిల్ తో హిందీలోనూ రీమేక్ అయింది. హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. వాటిని అందుకోవడంలో విఫలమైంది. అలాగే కత్రినా కైఫ్, ఇషా ఖట్టర్ , సిద్ధాంత్ చతుర్వేది నటించిన హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్ ని ప్రేక్షకులు తిరస్కరించారు.
ఖిలాడీ అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ రిలీజ్ కి ముందు పెద్ద సంచలనాన్ని సృష్టించింది. కానీ విడుదలయ్యాక ప్రేక్షకులను మాత్రం థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. కోట్ల రూపాయలు ఈ సినిమాకి ఖర్చు అయింది. ఈ విధంగానే అక్షయ్ నటించిన ‘రక్షాబంధన్’ కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు.ఇంకా మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా కూడా ఘోరమైన ఫలితాలు సాధించింది.













