అమర జవాన్లకు బాలీవుడ్ స్టార్ల భారీ విరాళం
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ముందుగా స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. తనవంతుగా చెక్కును ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించారు. ఆ తర్వాత ఎందరో స్టార్లు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వీళ్లలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తనవంతు సాయాన్ని చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా ప్రజలంతా పెద్ద ఎత్తున స్పందించాలని కోరారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి జవాన్ కుటుంబానికి ఆయన 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇక బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ స్పందించి జవాన్ల కుటుంబాలకు 2.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. మరో స్టార్ అజయ్ దేవగణ్ స్పందించి తాను నటిస్తున్న టోటల్ ధమాల్ చిత్ర బృందం తరపున రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇక అమర జవాన్ల కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏకంగా 5 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.













