బాబీ నోట హరిహర వీరమల్లు డైలాగ్
పవన్ నటిస్తున్న సినిమాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ తన రేంజ్ కు సరిపోయే సినిమాలు చేయట్లేదని ఫీలవుతున్న టైమ్లో క్రిష్ లాంటి మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ తో కలిసి సినిమాను పట్టాలెక్కించడంతో దీని గురించి అందరూ చాలా ఎక్కువగా ఊహించుకున్నారు.
ఎ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు చిత్ర షూటింగ్ మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ సినిమా గురించి ఎలాంటి టాపిక్ వచ్చినా సరే ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుంటారు. మొన్నా మధ్య పవన్ బర్త్ డే కు ఓ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా వార్తల్లోకొచ్చింది లేదు.
అయితే తాజాగా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరిహర వీరమల్లు ప్రస్తావన రావడంతో ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న బాబీ డియోల్ తో సుమ చిట్ చాట్ చేయగా, తెలుగు సినిమాలతో తన అనుబంధాన్ని వివరించాడు బాబీ డియోల్. సినిమా పేరు చెప్పకుండా, తానొక సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు బాబీ డియోల్ చెప్పాడు. అంతేకాదు ఆ సినిమాలో తనకొక డైలాగ్ గుర్తింది అంటూ బాద్షా బేగం మా ప్రాణం. మా ప్రాణాలు కాపాడావు. మీకేం కావాలో కోరుకోమని ఆదేశిస్తున్నాను అంటూ చెప్పాడు. బాబీ డియోల్ చెప్పిన ఆ డైలాగ్ తో సభా ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.













