బిగ్ బాస్..బిత్తిరి సత్తి…
స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ ఎప్పుడూ వార్తల్లో విశేషమే. ఈ రియాలిటీ షో ప్రతి సీజన్ ముందూ ఇందులో పాల్గొనే సెలబ్రిటీస్ గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తడం మామూలే. ఇక ప్రారంభమయ్యాక కూడా నిత్యం వార్తల్లో ఉండడం అందరికీ తెలిసిందే. అదే రకంగా మూడు సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక త్వరలో ‘బిగ్ బాస్4’ కూడా ప్రారంభం కానుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా .. సీజన్ 4 లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్ళేనంటూ ప్రచారం రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ‘తీన్మార్’ వార్తలను తెలంగాణ యాసలో.. అది కూడా తన దైన శైలిలో.. కామెడీగా చెబుతూ బోలెడు మంది అభిమానులను సంపాదించుకున్న బిత్తిరి సత్తి పేరు కూడా బాగా వినిపిస్తోంది. తప్పనిసరిగా ఈ సీజన్లో బిత్తిరి సత్తి కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.. నిజానికి ఇతను ‘బిగ్ బాస్ 3’ కే ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ‘తీన్మార్’ సావిత్రి బిగ్‌బాస్ తెర కెక్కింది. అయితే ఈసారి బిత్తిరి సత్తి.. బిగ్ బాస్ హౌస్ కు ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్ లోకి బిత్తిరి సత్తిని పంపిస్తే కచ్చితంగా మంచి టి.ఆర్.పి వస్తుందని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు భావిస్తున్నారట.
మరోవైపు వి6 చానెల్‌ను వదిలేసిన తర్వాత టీవీ9లో అడుగుపెట్టిన బిత్తిరి సత్తి కొన్ని బేధాభిప్రాయాల వల్ల ఆ చానెల్ నుంచి కూడా వైదొలగినట్టు సమాచారం. ఇప్పటికే అతని రాక కోసం పలు చానెళ్లు రెడ్ కార్పెట్ పరిచినా.. ఇంకా ఎవరికీ బిత్తిరి సత్తి ఓకె చెప్పకపోవడానికి కారణాల్లో బిగ్‌బాస్ కూడా ఉండొచ్చని అంటున్నారు. బిగ్‌బాస్ ముగిశాక తన కొత్త వేదికను ఎంచుకోవచ్చునని సత్తి భావిస్తున్నాడని అంటున్నారు. చిన్ని తెర మీద స్టార్ గా వెలుగుతున్న బిత్తిరి సత్తి.. ‘విన్నర్’ ‘గౌతమ్ నంద’ ‘సీత’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు. ‘తుపాకీ రాముడు’ సినిమాలో అయితే ఏకంగా హీరోగా మారి ఆశ్చర్యపరిచాడు. మరి ‘బిగ్ బాస్4’ లో ఎంటరైతే ఎలా దుమ్మురేపుతాడో…













