ఈసారి కాస్త లేట్‌గా మొదలుకానున్న బిగ్ బాస్
బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుంది. సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచి, వెంటనే అరెస్ట్ అవడం, రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేయడం వల్ల ఈ సీజన్ జనాల నోళ్లలో బాగానే నానింది. కానీ ఇవన్నీ బిగ్ బాస్ టీమ్ కు కాస్త ఇబ్బందిని కలిగించిన మాటైతే వాస్తవం. సీజన్ 7లో జరిగిన రచ్చని దృష్టిని ఉంచుకుని నెక్ట్స్ సీజన్ లో అలాంటివి మళ్లీ జరగ్గకుండా ఉండేలా బిగ్ బాస్ టీమ్ జాగ్రత్త పడుతుందట.
అయితే సీజన్ 8లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు ఉండనున్నారనేది బిగ్ బాస్ టీమ్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. బిగ్ బాస్ సీజన్ 8 జూన్ లేదా జులై లో మొదలు పెడతారనుకున్న ఫ్యాన్స్ కు బిగ్ బాస్ టీమ్ షాకిచ్చేలా ఉంది. ఈసారి బిగ్ బాస్ ను సెప్టెంబర్ లో మొదలుపెట్టాలనుకుంటుందట టీమ్. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం సెలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టారని సమాచారం.
లాస్ట్ సీజన్ లో సెలెక్ట్ అయినా వేరే కారణాల వల్ల ఆగిపోయిన కొందరు ఈసారి కంటెస్టెంట్స్ గా వస్తారని తెలుస్తోంది. మరోసారి హోస్ట్ గా నాగార్జునే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ కంటెస్టెంట్స్ లాగానే హోస్ట్ విషయంలో కూడా ఈసారి మార్పు ఉంటుందనుకున్నారు కానీ నాగార్జున తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో బిగ్ బాస్ యాజమాన్యం కూడా నాగ్ ను కొనసాగిస్తున్నారు.













