నాగార్జున బిగ్‌బాస్ షో చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడా? కారణం అదేనా?
బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభమై నాలుగు వారాలు పూర్తయింది. కరోనా కారణంగా నాలుగో సీజన్ ఉంటుందా, ఉండదా అనే సందిగ్ధంలోనే ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి వారం మంచి రేటింగే వచ్చింది. ఆ తర్వాత నుంచి రేటింగ్ తగ్గుతూ వస్తోంది. కరోనా వల్ల అందరూ ఇంటి పట్టునే ఉంటారు కాబట్టి మంచి రేటింగ్ వస్తుందని భావించిన నిర్వాహకులకు వస్తున్న రెస్పాన్స్ షాక్ ఇచ్చారు ప్రేక్షకులు. నాలుగో సీజన్లో తెలిసిన ముఖాలు లేకపోవడమే రేటింగ్ తగ్గడానికి కారణం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ షో చివరి వరకు నాగార్జున ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అందుకు కారణం నాగార్జునకు ఉన్న కమిట్మెంట్సే. ప్రస్తుతం నాగ్ చేస్తున్న వైల్డ్‌డాగ్ షూటింగ్ కరోనా వల్ల మధ్యలోనే ఆపేసారు.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ సినిమా కథ ప్రకారం కొన్ని కీలక సన్నివేశాలను రాజస్థాన్, కాశ్మీర్, లద్దాక్ ప్రాంతాల్లో తియ్యాలని ముందుగా ప్లాన్ చేసుకుంది చిత్ర యూనిట్. అక్కడ షూట్ చెయ్యాలంటే డిఫెన్స్ ఆధికారుల అనుమతి తప్పనిసరి. లాక్‌డౌన్‌కి ముందు షూటింగ్‌కి అనుమతి ఇచ్చింది డిఫెన్స్. అయితే ఆ తర్వాత లాక్డౌన్ విధించడం షూటింగ్ చేయలేకపోయారు. తాజా సమాచారం మేరకు డిఫెన్స్ అధికారులు మళ్లీ అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. అనుమతికి సంబంధించి డేట్స్‌కి, బిగ్‌బాస్ కోసం నాగార్జున కేటాయించుకున్న డేట్స్‌కి క్లాష్ రావడంతో చివరి వరకు నాగార్జున ఈ షోలో ఉంటాడా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. డిఫెన్స్ వారు ఇచ్చిన డేట్స్ మార్చడానికి వీలు పడదు కాబట్టి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నాగార్జునే తీసుకోవాలి కాబట్టి బిగ్‌బాస్‌కి గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. ఈసారి బిగ్‌బాస్ పది వారాలకే పరిమితం చేశారు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి. మిగతా ఆరు వారాలు వేరే వారికి షోను నిర్వహించే బాధ్యతను అప్పగించాలని ఆలోచిస్తున్నారట.
ఇదిలా ఉంటే ఇకపై బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించకూడదని నాగార్జున నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దానికి కారణం సోషల్ మీడియాలో నాగార్జునకు ట్రోలింగ్ పెరిగిపోవడమే. 60 సంవత్సరాలు పైబడిన నాగార్జున… గంగవ్వను అవ్వ అని సంభోదించడం నెటిజన్లకు నచ్చలేదు. ఎందుకంటే నాగార్జునకు, గంగవ్వకు వయసులో అంత తేడా లేదు కాబట్టి అలా సంభోదించడం కరెక్ట్ కాదని నెటిజన్ల అభిప్రాయం. దీంతో బిగ్‌బాస్ షోకి ఇకపై దూరంగా ఉండాలని నాగార్జున నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే వైల్డ్‌డాగ్ షూటింగ్ నెపంతో నాగార్జున షో నుంచి తప్పుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే నాగార్జున కావాలనే షో నుంచి తప్పుకోవడానికి రెడీ అయ్యాడనిపిస్తుంది. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్‌కి వెళ్లడం, ఇకపై బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించకూడదన్న నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ మీడియాలో వినిపిస్తున్న వార్తలే. వీటికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి వీటిలో నిజమెంత వుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.













