Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ విడుదల
గాయకుడిగా మొదటి పాటతోనే అదరగొట్టిన నవీన్ పొలిశెట్టి
వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. ‘భీమవరం బల్మా’ పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది.
మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా ‘భీమవరం బల్మా’ గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. ఇద్దరి జోడి చక్కగా కుదిరి, పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
మిక్కీ జె మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. విన్న వెంటనే శ్రోతల మనసు దోచుకోని, వారిచే కాలు కదిపించేలా.. ఆయన స్వరపరిచిన తీరు మెప్పించింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో.. ఎంతో అందంగా, అర్థవంతంగా పాటను రచించారు. నవీన్ పొలిశెట్టితో కలిసి గాయని నూతన మోహన్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట.. థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనగనగా ఒక రాజు చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీస్థాయిలో విడుదల కానుంది.






