జనవరి 26న మహేష్ ప్రమాణ స్వీకారం
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్లైలిష్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ భరత్ అను నేను. మహేష్ 24వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై డీవివి దానయ్య నిర్మిస్తుండగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నట్టు టాక్. ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ తన ట్విట్టర్లో మూవీకి సంబంధించి బిగ్ ఎనౌన్స్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించగా, అది ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.
అయితే సంక్రాంతి సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రమాణ స్వీకార పాఠంతో ఉన్న పోస్టర్ని విడుదల చేస్తూ, మూవీ ఫస్ట్ లుక్‌ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్లో భారీగా ప్రజలు, దానిపై శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల, నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో, అంత కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ఉంది. ఏప్రిల్ 27న మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.













