భగవంత్ కేసరి పైనే ప్రైమ్ ఆశలన్నీ!
ఐదు వారాల పాటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకున్న బాలకృష్ణ తాజా సినిమా భగవంత్ కేసరి ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్రలో నటించిన భగవంత్ కేసరి నిర్మాతలకు మంచి లాభాలనే మిగిల్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చెప్పకుండానే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది ప్రైమ్ వీడియో.
సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చే ముందు ప్రమోషన్స్ చేస్తుంటారు ఎవరైనా. కానీ ప్రైమ్ వీడియో ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చి, సినిమాను ముందు సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ చేసి, ఆ తర్వాత భారీగా ప్రమోట్ చేస్తుంది. అయితే భగవంత్ కేసరిని ఆడియన్స్ మరోసారి చూసేందుకు కూడా ప్రైమ్ ఓ రీజన్‌ను చెప్తోంది.
బాలయ్య ఈ సినిమా కోసం మొదటిసారి స్వయంగా హిందీ లో డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ వెర్షన్ ను కూడా ప్రైమ్ అందుబాటులోకి తెచ్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య నటించిన భగవంత్ కేసరి ప్రైమ్ కు మంచి వ్యూస్ తీసుకురావడం ఖాయంగానే కనిపిస్తుంది. గత కొన్నాళ్లుగా నెట్‌ఫ్లిక్స్ దెబ్బకు పెద్ద సినిమాలను చేజార్చుకున్న ప్రైమ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. అందుకే ఈ సినిమాను అన్ని భాషలను ఒకేసారి డబ్బింగ్ చేసి అందుబాటులో ఉంచారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న భగవంత్ కేసరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను రాబట్టుకుంటుందో చూడాలి.













