Gummadi Narsayya: శివ రాజ్ కుమార్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘గుమ్మడి నర్సయ్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్

ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజా మనిషి గుమ్మడి నర్సయ్య (Gummadi Narsayya) జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వస్తున్నారు. పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరు అందరికీ తెలిసిందే. ఇక గుమ్మడి నర్సయ్య పాత్రలో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటించబోతున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే గుమ్మడి నర్సయ్య పాత్రకు శివ రాజ్ కుమార్ ప్రాణం పోసినట్టుగా కనిపిస్తోంది. ఆ లుక్, వేషధారణ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సైకిల్, వెనకాల ఉన్న అసెంబ్లీ, ఎర్ర కండువా ఇలా అన్నీ కూడా ఎంతో అథెంటిక్‌గా ఉన్నాయి. ఇక ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసినట్టు అయింది. ఇక మోషన్ పోస్టర్‌లో ఎమ్మెల్యేలు అంతా కూడా కారులో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌లో రావడం.. ఆ మ్యూజిక్, ఆర్ఆర్.. విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తోంది.
నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించబోతోన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.